మంత్రి గుమ్మడి సంధ్యారాణికి డిమాండ్ల పత్రం
అరకులోయ జనవరి 30, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఆదివాసి ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ ఆదివాసి గిరిజన సంఘం ప్రతినిధులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలలో ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల చట్టాలకు విరుద్ధంగా హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం జారీ చేసిన అక్రమ జీవోలు నెంబర్ 2, 13, 51లను తక్షణమే రద్దు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం జన్మన్ హౌసింగ్ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు లక్ష రూపాయలను వెంటనే విడుదల చేయాలని, టీవీ–పీ.జీ గ్రామాల్లో ప్రకటించిన 12 రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగంలో ఆదివాసి మాతృభాష బోధన చేస్తున్న బహుభాషా ఉపాధ్యాయులకు జీతభత్యాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, 2026–27 విద్యా సంవత్సరానికి రీన్యువల్ ఇవ్వాలని కోరారు. అలాగే గురుకులం, ఏకలవ్య పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది సెక్యూరిటీ గార్డులను గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగించి నెలకు రూ.17,500 వేతనం చెల్లించాలని, యూనిఫాం, బూట్లు, టోపీ, టార్చ్ లైట్, లాఠీ వంటి రక్షణ పరికరాలు అందించాలని, కలెక్టర్ గెజిట్ జీవో వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసులు సాగు చేస్తున్న కొండపోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించి హక్కులు కల్పించాలని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ పండిస్తున్న ఆదివాసి రైతులకు బకాయి రాయితీలు రూ.60 కోట్లను వెంటనే చెల్లించాలని, బెర్రీ బొర్రర్ వ్యాధితో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
అదేవిధంగా ఆదివాసి ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు నిర్మించి డోలిమోతాల నివారణ చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాంగి సత్యనారాయణ, కిల్లో జగనాథం, డీఎస్సీ సాధన కమిటీ కో కన్వీనర్ గుజ్జెల సురేష్, జిల్లా నాయకులు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


