Trinethram News : ఈ రోజు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షులు జుజ్జూరి ఐరా మూర్తి, టిడిపి నాయకుల బెదిరింపులు, బీసీలపై జరుగుతున్న అణచివేత చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
- దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీలకు సముచిత స్థానం కల్పించిన చరిత్ర ఉన్నప్పటికీ, నేటి టిడిపి ప్రభుత్వం మాత్రం “బీసీ రక్షణ చట్టం” పేరుతో బీసీలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. బీసీ నాయకులపై బహిరంగంగానే బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు.
నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శావల్యాపురం మండల కేంద్రంలో టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన సభలో, శావల్యాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి, మండల నాయకులు మరియు గుంటూరు సాంబశివరావులు తనను వ్యక్తిగతంగా “నీ అంతు చూస్తాం” అంటూ బెదిరించారని ఐరా మూర్తి వెల్లడించారు. ఇది బీసీలపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న రాజకీయ అణచివేతకు నిదర్శనమన్నారు.
గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించినందుకే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, నిజాయితీగా, ఆత్మగౌరవంతో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా రాజకీయాల్లో ఎదిగామని, ఇలాంటి బెదిరింపులకు తాము ఎప్పటికీ భయపడబోమని స్పష్టం చేశారు.
స్థానిక వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోత్సాహంతోనే టిడిపి నాయకులు గ్రామాల్లో బీసీలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. “ఇదేనా బీసీ పరిరక్షణ?” అంటూ ప్రశ్నించారు.
టిడిపిలో ఉన్న బీసీలు కూడా ఈ విధానాన్ని ఖండించాలని సూచిస్తూ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ భయభ్రాంతులకు గురిచేసే రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇలాంటి బెదిరింపులు మొదలయ్యాయని, కొందరు ముందస్తుగా హెచ్చరికలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. అయితే తాను బలహీనుడిని కాదని, అవసరమైతే చివరి వరకూ పోరాటం చేస్తానని ఐరా మూర్తి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


