అరకులోయ,జనవరి 4, (త్రినేత్రం న్యూస్) : అల్లూరిజిల్లా అరకువేలి మండలంలో జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమాణి శ్రీ పూజ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అభివృద్ధి పనులను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
సుంకరమెట్ట ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్, హాజరు పట్టి, అవుట్‌పేషెంట్ల రిజిస్టర్‌తో పాటు ఆసుపత్రిలో జరిగిన డెలివరీ కేసుల వివరాలను పరిశీలించారు. వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు.
అరకు వేలి మండలంలోని కరకవలస గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అలాగే పిరి బంధ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల చదవడం, రాయడం సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రగతిపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
బలియగూడ గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సుంకరమెట్ట గ్రామం నుంచి కటికి వాటర్ ఫాల్స్ వరకు ఉన్న రహదారి నాణ్యతను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
బలియగూడ, బోరక వలస, పెద్దవలస గ్రామాల్లో సోలార్‌తో పనిచేసే బోర్‌వెల్స్ సరిగా పనిచేయడం లేదని గ్రామస్తులు చేసిన ఫిర్యాదులపై స్పందించిన జాయింట్ కలెక్టర్, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్‌ను ఆదేశించారు.
బోరక వలస గ్రామంలో రీ సర్వే ప్రాజెక్టు కింద పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పీఎన్ జన్మన్ పథకం కింద నిర్మించిన గృహాలకు కొత్తగా ఎలక్ట్రికల్ మీటర్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు.
అరకువేలి మండలం లోతేరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆమె, విద్యార్థుల చదవడం, రాయడం సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో (ఎఫ్‌ఎల్‌ఎన్) అమలు సరిగా లేదని గుర్తించి, ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే డిప్యూటీ వార్డెన్ విధుల్లో అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధులలో నిర్లక్ష్యం వహించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
లోతేరు పంచాయతీ పరిధిలోని బోర్ కావలస గ్రామ రైతులకు రీ సర్వే ద్వారా లబ్ధి పొందిన ‘మీ భూమి – మీ హక్కు’ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఫోన్ కాల్స్‌కు సరైన విధంగా స్పందించాలని, ఈ పట్టాల ద్వారా ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలు వంటి ప్రయోజనాలు పొందవచ్చని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో లోతేరు గ్రామ సర్పంచ్ జి. కళావతి, మండల తహసీల్దార్ కె. కుమారస్వామి, డిప్యూటీ తహసీల్దార్ పి. గోవిందు, వీఆర్‌ఓ ఎస్. నవీన్ బాబు, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


