Special Buses : బతుకమ్మ, దసరా కోసం ఈసారి టీజీఎస్ ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులు

TRINETHRAM NEWS

ఈనెల 20 నుంచి అక్టోబర్​ 2 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

Trinethram News : బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు సిద్ధం చేసింది. మొత్తం 7,754 ప్రత్యేక బస్సులను నడపనుంది. రద్దీకి తగ్గట్లుగా ఈసారి గత దసరా కంటే అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 20 నుంచి అక్టోబరు 2 వరకు ఈ స్పెషల్​ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అక్టోబరు 5,6 తేదీల్లో తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ బస్సుల్లో అదనంగా 50 శాతం వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.

హైదరాబాద్​లో ప్రధాన బస్టాండ్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్​తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్​బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్​సుఖ్​ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సులు న‌డుపుతోంది.

ముందస్తు రిజర్వేషన్​ సౌకర్యం :
స్పెషల్ బస్సుల్లో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. సద్దుల బ‌తుకమ్మ ఈ నెల 30న‌, అక్టోబ‌ర్ 2న దసరా ఉన్నందున ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముండ‌టంతో ఆ మేర‌కు ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది.

జీవో 16 ప్రకారం ప్రయాణికులపై అదనపు భారం :
దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం ప్రయాణికులను తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకే టికెట్ ధ‌ర‌లను సవరించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదీ వరకు వరకు, అక్టోబర్ 1,5,6వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది. అవి యథావిధిగా ఉంటాయి. ఈనెల 20వ తేదీన 662 బస్సులు, 27వ తేదీన 1,028 బస్సులు, 28వ తేదీన 1,010 బస్సులు, 29వ తేదీన 941 బస్సులు, 30వ తేదీన 824 బస్సులు, అక్టోబర్ 1వ తేదీన 884 బస్సులు నడిపించాలని నిర్ణయించింది.

ర‌ద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్​లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎల్బీన‌గ‌ర్, ఉప్పల్, ఆరాంఘ‌ర్, కేపీహెచ్​బీ, సంతోష్ నగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌక‌ర్యార్థం షామియానాలు, కుర్చీలు, త్రాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు ప‌బ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారుల‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని గుర్తించి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారన్నారు. పోలీస్, ర‌వాణా, మున్సిపల్ శాఖల అధికారుల‌తో స‌మ‌న్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల‌కు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందని ​ఆర్టీసీ ఎండీ సజ్జనర్ పేర్కొన్నారు.

ఈ నంబర్లకు కాల్​ చేయండి :
పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సూచించారు. టీజీఎస్​ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో చేసుకోవాలని సూచించారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని తెలిపారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

special buses for Bathukamma and Dussehra

You cannot copy content of this page

Scroll to Top