అల్లూరి జిల్లా, అరకు లోయ త్రినేత్రం న్యూస్ జూన్ 28: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 గా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెలో భాగంగా అల్లూరి జిల్లా ఐటిడిఏ, జిసిసి పరిధిలో పనిచేస్తున్న కార్మికులు మద్దతు ప్రకటించారు. గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, కొత్తపల్లి జలపాతం, చాపరాయి మరియు జిసిసి సోప్ యూనిట్లలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు యూనిట్ మేనేజర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు సిఐటియు అరకు వ్యాలీ మండల కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు జె. భగత్ రాం, ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దాడి రాజు, జిసిసి సోప్ యూనిట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పి. సింహాద్రి తదితరులు మాట్లాడారు. “కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరించేవిగా ఉన్నాయి. ఇవి అమలైతే కార్మికులు బానిసలుగా మారిపోతారు. కనీస వేతనాలు, పని గంటలు, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి హక్కులన్నీ నశించిపోతాయి” అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని పద్ధతిని రద్దు చేసి 10 గంటల పని విధానం అమలుకు ప్రయత్నిస్తుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు. రోజురోజుకు జీవన వ్యయం పెరుగుతుంటే వేతనాలు మాత్రం స్థిరంగా ఉండటాన్ని విమర్శించారు. ఐటిడిఏ పరిధిలో వేలాది మంది కార్మికులు సంవత్సరాలుగా పని చేస్తున్నప్పటికీ పర్మినెంట్ చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. కార్మికులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, కొత్తగా చేరిన కార్మికులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిసిసి వర్కర్స్ యూనియన్ నాయకులు పద్మ, రామ్ చందర్, దాసు బాబు, సత్యరావు, ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


