Traveling on a Bridge : వంతెన లేక వాగు పై ప్రయాణం – సూటిగా మరణ యాత్ర

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా,అనంతగిరి మండలం త్రినేత్రం న్యూస్, జూన్ 15: అంతకంతకూ పెరుగుతున్న వర్షాలకు అల్లూరిజిల్లా అనంతగిరి మండలం జెమ్ముడు గుమ్మి గడ్డ వద్ద వాగు ఉప్పొంగి పరుగులు పెడుతోంది. పెదకోట పంచాయతీ నుంచి హుకుంపేట, కీవర్ల, డుంబ్రిగూడ మండలాలకు వెళ్లే మార్గంలో ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజల రాకపోకలు పూర్తిగా కష్టసాధ్యమయ్యాయి.
ఈ రహదారి మూసుకుపోవడం వల్ల 300కు పైగా గ్రామాలు మండలాల ప్రధాన కేంద్రాలతో సంబంధాలు కోల్పోయిన పరిస్థితి. ప్రతి రోజు వేలాది మంది ప్రజలు ఈ వాగు దాటాల్సి వస్తోంది. వంతెన లేకపోవడంతో వర్షాకాలం వస్తే ప్రయాణం ఓ ప్రాణాంతక పర్వతారోహణలాగా మారుతోంది. “ఒడ్డుకు చేరకపోతే ప్రాణాలే పోతాయ్… అయినా వెనక్కు తిప్పుకునే అవకాశమే లేదు,” అని వాపోతున్నారు ప్రయాణికులు.
వెళ్తున్న మార్గాలు ఏవీ చిన్నవి కావు – దేవరపల్లి, పినకోట, పెదకోట, కీవర్ల మీదుగా హుకుంపేట, డుంబ్రిగూడ, పాడేరు, అరకు వంటి కీలక మండలాలకు ఈ మార్గం జీవనాడి. ఎన్నో దశాబ్దాలుగా వంతెన అవసరమని వినతులు చేస్తున్నా… ఇప్పటికీ ఫలితం శూన్యం. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడుతున్నారు స్థానికులు. ప్రతి వర్షాకాలం నరకయాతనగా మారుతుంది. వాగులో నీరు పోటెత్తితే… చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు బయట పడలేరు. అత్యవసర వైద్య సేవలు కూడా అందలేని పరిస్థితి. ఆంబులెన్సులు కూడా ఆగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో అనంతగిరి మండల జనసేన అధ్యక్షుడు చిట్టం మురళి స్పందిస్తూ, “ఈ సమస్యను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే వంతెన నిర్మాణానికి అనుమతులు రావాలనఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్ష స్పష్టంగా ఉంది – ఒక్కసారి అయినా ప్రభుత్వం చూసి స్పందించాలి! వర్షాకాలం ఇంకా మొదలైన దశలోనే… వాగుపై వంతెన నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Traveling on a bridge

You cannot copy content of this page

Scroll to Top