అల్లూరుజిల్లా (అరకులోయ)త్రినేత్రం న్యూస్ మే 16: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అల్లూరి జిల్లా వైద్యాధికారి (ఏఎంఓ) డాక్టర్ సత్యనారాయణ తెలిపారు.
గురువారం అరకులోయ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లవరాజు, ఈఓపిఆర్‌డి సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 పంచాయతీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సత్యనారాయణ, ప్రతి పంచాయతీలో మే 16న డెంగ్యూ నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
డెంగ్యూ వ్యాధి చాలా ప్రాణాంతకమైందని, ఇది ఏడిస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందని తెలిపారు. ఇది వెస్ట్ నైల్ వైరస్, పసుపు జ్వరంతో సంబంధిత వైరస్‌గా పేర్కొన్నారు. తీవ్రమైన తలనొప్పి, కీళ్లనొప్పులు, మలమలనొప్పి, అలసట, జ్వరం, వాంతులు, ఐదు రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు, కొద్దిపాటి రక్తస్రావం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు.
డెంగ్యూ నివారణకు ప్రతి ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా చూడాలని, నీటి నిల్వలు ఉండే డ్రములు, డబ్బాలు వంటి వాటికి కచ్చితంగా మూతలు వేయాలని సూచించారు. ప్రతి వారం ‘డ్రై డే’ పాటించి నీటి నిల్వలను ఖాళీ చేయాలని అన్నారు. ప్రజలకు వీటిపై చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఈ సమావేశంలో 14 పంచాయతీల కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


