అన్న ఎన్‌టీఆర్ స్ఫూర్తితో అడుగులు వేద్దామన్న ఎమ్మెల్యే గోరంట్ల…
త్రినేత్రం న్యూస్ : తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు, అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం హుకుంపేట పంచాయితీ డి.బ్లాక్ నందు సోమేశ్వరరావు మరియు స్థానిక నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి, అన్న ఎన్టీఆర్ అని పేదవారికోసం వారి భవిష్యత్ తరాల కోసం ఒక రక్షణ కవచం లాంటి వాటిని ఏర్పాటు చేశారని ఇప్పుడు ఉన్న తరాలు వారికి, రాబోయే తరాలు వారికి ఆయన గురించి తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.
ఎక్కడో పుట్టిన తాను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఎన్‌టిఆర్ పెట్టిన భిక్ష అని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాలలో పదిసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఏడు సార్లు టీడీపీ విజయం సాధించడం వెనుక కార్యకర్తల త్యాగం ఉందని, వారి త్యాగం వల్లే నేటికీ నాయకుడుగా నిలవగలిగానని అన్నారు. ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు శ్రమించడం, త్యాగాలు చేయడం వల్లనే టిడిపి పటిష్టంగా ఉందని అన్నారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సినిమాల్లో పౌరాణికం, జాన పదం, సాంఘికం ఇలా అన్ని రకాల పాత్రలు వేశారని, ఆయన చేయని పాత్ర అంటూ లేదని, అసలు ఎన్టీఆర్ తరహాలో నటించిన మరో నటుడు లేరంటే అతిశయోక్తి లేదని గోరంట్ల వివరించారు. తెలుగు దేశం పార్టీ పెట్టడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి ఒక గుర్తింపు లభించిందన్నారు. ఎంతోమంది చదువుకున్నవాళ్ళకు, యువకులకు, బడుగు బలహీన వర్గాలకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసారని ఆయన అన్నారు. తన వరకూ తీసుకుంటే పార్టీ పెట్టినపుడు గోదావరి జిల్లాల పార్టీ కన్వీనర్ గా నియమించి గౌరవించారని, 1985లో రెండవసారి గెలిచినప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని భావించారని, చివరకు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షునిగా నియమించి, 16మంది ఐఏఎస్ లను డైరెక్టర్లుగా పెట్టి ప్రణాళిక బోర్డుని శక్తివంగంగా చేసారని గోరంట్ల గుర్తు చేసుకున్నారు.
అన్న ఎన్‌టిఆర్ ఇచ్చిన నినాదమే ప్రజల వద్దకే ప్రభుత్వం అని, కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్లడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, చెల్లుబోయిన శ్రీనివాస్, దుద్దుపూడి రామకృష్ణ, మండ బిందు, దుద్దుపూడి రమేష్, పెండ్యాల రామకృష్ణ, బొప్పన నానాజీ, మట్ట శ్రీను, బొప్పన శ్రీను, గారపాటి నాగేశ్వరరావు, హిరసింగ్, ఇమ్మంది శివరామకృష్ణ, దుర్గాప్రసాద్ (చిక్కు), చామoడ్రి నాని తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


