ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడుతూ, ఆదివాసీ ప్రత్యక డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మే 2న రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్ నిర్వహించనున్నట్లు గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా అరకువేలిలో గిరిజన సంఘం భవనంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్, ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు వంతాల అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీ ఐటిడిఎ పరిధిలో ఉన్న 766 పోస్టుల్లో కేవలం 42 పోస్టులే ఆదివాసీలకు కేటాయించారని తెలిపారు. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం పూర్తిగా న్యాయం కాదని, ఇది ఆదివాసీ యువతపై ఘోర అన్యాయమని పేర్కొన్నారు.
జి.ఓ నెం.3 వలన ఆదివాసీలకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే హక్కు లభించిందని, అయితే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేసి ఆదివాసీలను దగా చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలో 100% ఉపాధ్యాయ నియామక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రకటించిన 400 పోస్టుల్లో కేవలం 24 పోస్టులే ఆదివాసీలకు కేటాయించడంపై సంఘం తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం ఐటిడిఎ పరిధిలో 1035 పోస్టుల్లో 61 మాత్రమే, పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పరిధిలో కేవలం 10 పోస్టులే ఆదివాసీలకు దక్కాయని మండిపడ్డారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం నేతలు కిల్లో జగన్నాధం, హరి సహదేవ్, డి.ఎల్.ఓ జిల్లా నాయకులు కొర్రా ప్రసన్న, ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చట్టు మోహన్, పెసా కమిటీ సభ్యులు ఎం.రమేష్, రాజ్ కుమార్, డీఎస్సీ అభ్యర్థులు గుజ్జెల సురేష్, మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సంఘం అన్ని వర్గాల ప్రజలను మే 2న జరిగే మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


