అల్లూరుజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్,ఏప్రిల్ 27: కేంద్ర నిఘా వ్యవస్థ జారీ చేసిన కీలక హెచ్చరికల నేపథ్యంలో, అరకు లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడానికి అధికారులు ముమ్మర తనిఖీలకు తెరలేపారు. ఈ తనిఖీలను అరకు సీఐ ఎల్. హిమగిరి, అరకు వేలీ ఎస్సై జి. గోపాలరావు నేతృత్వంలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్న అరకు వేలీ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్పిఎఫ్ పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబు డిస్పోజల్ టీం (బీడీ టీం) సమిష్టిగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా అరకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ప్రసిద్ధి గాంచిన పద్మాపురం గార్డెన్, ఆదివాసి సంస్కృతిని ప్రతిబింబించే ట్రైబల్ మ్యూజియం,కాఫీ మ్యూజియం వంటి ప్రదేశాలలో పరిశీలనలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు, చలనం కలిగించే కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
తనిఖీల సమయంలో స్థానిక ప్రజలకు, పర్యాటకులకు పోలీసులు అప్రమత్తం చేశారు. ఏదైనా అనుమానాస్పద విషయాన్ని గమనించిన వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భద్రత చర్యల్లో భాగంగా అదనపు సిబ్బందిని మోహరించడం, సీసీ కెమెరాల ద్వారా నిత్య నిఘా ఉంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు అరకు పోలీసు అధికారి హిమగిరి తెలిపారు.
ప్రస్తుతం అరకు లో భద్రతా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ, కేంద్ర నిఘా వ్యవస్థ సూచించిన సూచనల మేరకు అప్రమత్తత కొనసాగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


