
తుఫాన్‌కు కొట్టుకుపోయిన బ్రిడ్జి కింది భాగం.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్
Poor Quality Bridge : అరకులోయ నవంబర్ 14, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం సిరిగం పంచాయతీ పరిధిలోని వర్రతోకవలస గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో గడ్డ వద్ద నిర్మించిన వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వచ్చిన తుఫాన్ ప్రభావంతో గడ్డకు భారీగా వరద ప్రవాహం రావడంతో వంతెన కింది భాగం కొట్టుకుపోయింది. దీంతో బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరుకుంది. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే గ్రామస్థులు, వాహనదారులు ప్రమాద భయంతో ఆందోళన చెందుతున్నారు.
వంతెన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వంతెనను పరిశీలించి, నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యతతో కూడిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను వైయస్సార్ టీ ఎఫ్ సిరిగం పంచాయతీ ప్రెసిడెంట్ కిలో జగన్ కుమార్ కోరుతున్నారు.
జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్లో రహదారుల అభివృద్ధిపై వినతి మరోవైపు సిరిగం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, వంతెనల నిర్మాణం చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్ స్పందన కార్యక్రమంలో వినతిపత్రం వైయస్సార్ టీఎఫ్ సిరిగం పంచాయతీ ప్రెసిడెంట్ కిలో జగన్ కుమార్ సమర్పించారు. ఇందులో భాగంగా పలు రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను అధికారులకు అందజేశారు.
ప్రతిపాదించిన బీటీ రహదారుల వివరాలు:
పెదపాడు జంక్షన్ వరకు మూడు కిలోమీటర్లు, వర్రతోకవలస జంక్షన్ నుంచి బుడియావలస గ్రామం వరకు రెండు కిలోమీటర్లు, పాడేరు హైవే రోడ్డు నుంచి బంధపనివలస గ్రామం వరకు రెండు కిలోమీటర్లు, కప్పలగొంది నుంచి డెర్ని వరకు రెండు కిలోమీటర్లు , చొంపి జంక్షన్ నుంచి వర్ర గ్రామం వరకు పదేడు కిలోమీటర్లు
సీసీ రోడ్లు, డ్రైనేజీల ప్రతిపాదనలు:
కప్పలగొంది ప్రాంతంలో మూడు సీసీ రోడ్డు పనులు, వర్రలో ఒకటి, సంధివలసలో ఒకటి, సిరిగంలో ఒకటి, లంతంపాడులో ఒకటి, వర్రతోకవలసలో ఒకటి చొప్పున సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే కోడిపుంజువలస, కప్పలగొంది, దిబ్బవలస, లంతంపాడు, తెంగడవలస ప్రాంతాల్లో సీసీ డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. కప్పలగొంది గడ్డ వద్ద వంతెన నిర్మాణానికి కూడా అంచనాలు తయారు చేశారు.
అమరావతికి చేరిన ప్రతిపాదనలు.. నిధుల మంజూరుపై ఎదురుచూపులు
ఈ అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలు తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించడంతో పాటు, అమరావతిలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కార్యాలయానికి కూడా ఫైల్ పంపించినట్లు జగన్ కుమార్ తెలిపారు ఏళ్ల తరబడి రహదారులు, డ్రైనేజీలు, వంతెనల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామాలకు ఈ ప్రతిపాదనలు అమలైతే ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా వర్రతోకవలస వద్ద దెబ్బతిన్న వంతెనపై అధికారులు తక్షణమే స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని, ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe