అక్టోబర్ 26, 2026
TRINETHRAM NEWS
Cyclone Threat

Cyclone Threat : అల్లూరి జిల్లా,పాడేరు, అరకులోయ అక్టోబర్ 26(త్రినేత్రం న్యూస్): రానున్న తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అల్లూరి సీతారామరాజు జిల్లా, మండల స్థాయిల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తుఫాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని తెలిపారు. వాగులు, గెడ్డలు, నదులు దాటడం, వరద నీరు ప్రవహించే రహదారులపై ప్రయాణించడం చేయరాదని హెచ్చరించారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిస్తే సహకరించాలని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలకు వెళ్లకుండా, అత్యవసర మందులు, తాగునీరు, టార్చ్‌లైట్, మొబైల్ ఫోన్ వంటి అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, అగ్నిమాపక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు, తాగునీరు, ఆహారం, రవాణా, ఇతర సహాయక ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వరదలు, రహదారి అంతరాయాలు, చెట్లు కూలిపోవడం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కంట్రోల్ రూమ్ సంప్రదింపు నంబర్లు: కలెక్టరేట్ ల్యాండ్‌లైన్: 08935-293448 అత్యవసర సంప్రదింపు: 92818 56953
ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలు పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌లను సంప్రదించి సహాయం పొందాలని కలెక్టర్ టి. నిషాంతి విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page