
నేడు అరకు లోయలో చంద్రబాబు పర్యటన.. గన్నెలలో బహిరంగ సభ
Arrangements Completed : అల్లూరిజిల్లా అరకులోయ ఆగస్టు 29, (త్రినేత్రం న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అరకు లోయలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పోలీసులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గన్నెల గ్రామ సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గత మూడు రోజులుగా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, పోలీసులు సభా ప్రాంగణాన్ని సందర్శిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సభా ప్రాంగణం వద్ద ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజా సమావేశంతో పాటు టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
అరకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దొన్ను దొర సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. అరకు పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి తేజోవతి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ, ఐటీడీఏ పీవో వర్మ తదితర అధికారులు సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
కట్టుదిట్టమైన భద్రత…. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సభా ప్రాంగణంతో పాటు సీఎం పర్యటించే మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరకు లోయ పరిసర ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ సీఎం పర్యటన కార్యక్రమాలు… ఈరోజు ఉదయం సుమారు 11 గంటలకు ఎలిఫ్యాడ్ వద్ద హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి దిగనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి గన్నెల ఆర్కే నగర్‌లోని ఏకలవ్య పాఠశాలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం గన్నెల గ్రామంలో ‘సంజీవిని’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆర్కే నగర్‌లో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో సీఎం ముఖాముఖి కానున్నారు.
తదుపరి గన్నెల గ్రామ సమీపంలోని సభా ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు.
అరకు లోయలో రాజకీయ సందడి… చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అరకు లోయలో రాజకీయ సందడి నెలకొంది. భారీ సంఖ్యలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సభకు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అధికార యంత్రాంగం, పోలీసులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe