
మిస్సింగ్ కేసును ఛేదించిన అర్బన్ రమేష్ … నిందితుడి అరెస్ట్
Brutal Murder Girlfriend : త్రినేత్రం న్యూస్ : చిలకలూరిపేట: ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరికి దగ్గరవుతోందనే అనుమానంతో ఓ ఉన్మాది ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆపై సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి అసలు గుట్టు రట్టు చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలనుడి.ఎస్.పి ఎం. హనుమంతురావు శనివారం వెల్లడించారు.
ప్రేమ, అనుమానం.. పథకం ప్రకారమే హత్య
చిలకలూరిపేట పట్టణం వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ వలి కుమార్తె షేక్ హసీనా @ యాస్మిన్ (23) తుమ్మలపాలెం హైవే వద్ద ఉన్న మిట్టపల్లి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం సూళ్లూరుపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గుంటూరులోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువును మధ్యలో ఆపేసి, ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్న కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జినుగు బాల సైదులు (25), హసీనాలు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.అయితే, ఇటీవల హసీనా తనతో తక్కువగా మాట్లాడుతుండటంతో.. ఆమె వేరే వ్యక్తికి దగ్గరవుతోందని, తనను కావాలనే దూరం పెడుతోందని సైదులు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 4వ తేదీన హసీనాకు ఫోన్ చేసిన సైదులు, మాయమాటలు చెప్పి కారంపూడికి రప్పించాడు. మాట్లాడుకుందామని నమ్మించి, అక్కడి నుంచి కారంపూడి – నకరికల్లు రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కాలువ పశ్చిమ కట్ట వద్ద ఉన్న ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
కత్తితో పొడిచి.. పెట్రోల్ పోసి దహనం
ఎవరూ లేరని నిర్ధారించుకున్న సైదులు, ముందుగానే తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన ఎడమ చేతితో హసీనా గొంతు గట్టిగా పట్టుకుని, ఆమె కడుపులో మూడుసార్లు బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో హసీనా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య అనంతరం సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు, తన బైక్‌లోని పెట్రోల్‌ను ఓ ఖాళీ వాటర్ బాటిల్‌లో పట్టి, మృతదేహంపై పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారయ్యాడు.
మిస్సింగ్ కేసు విచారణలో వెలుగులోకి..
కూతురు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడం, కనిపించకుండా పోవడంతో బాధితురాలి తండ్రి మస్తాన్ వలి చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, ఎస్పీ జె.వి. సంతోష్, నరసరావుపేట డి.ఎస్.పి ఎం. హనుమంతురావు ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆగస్టు 8న కారంపూడి పాత సినిమా హాలు సెంటర్ (హోండా షోరూం) వద్ద నిందితుడు సైదులును చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. మహిళ అదృశ్యం కేసును హత్య కేసుగా (Cr No 214/2026 u/s 103(1), 140(1), 238 BNS) మార్చారు. నిందితుడిని కోర్టులోహాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో చిలకలూరిపేట టౌన్ సీఐ పి. రమేష్, ఎస్ఐలు వి. సోమేశ్వరరావు, పి. హజరత్తయ్య, మరియు వారి సిబ్బంది కీలక పాత్ర పోషించటం జరిగిందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe