TRINETHRAM NEWS

Trinethram News : ఉపాధిపై ఆధార్‌ దెబ్బ.. పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు

1 నుంచి అమల్లోకి వచ్చిన ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపులు
దీని వల్ల ఉపాధిహామీ పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది
నరేగా సంఘర్ష్‌ మోర్చా ఆందోళన.. పేదలకు శరాఘాతమేనని ఆవేదన

NREGA | న్యూఢిల్లీ, జనవరి 4: ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపు విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురావటంపై ఉపాధి హామీ కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది దాదాపు 8.9 కోట్లమంది గ్రామీణ కార్మికుల్ని అనర్హులుగా మార్చుతుందని ‘నరేగా సంఘర్ష్‌ మోర్చా’ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ పౌర సంఘాలతో సంప్రదింపులు జరిపి ‘ఏబీపీఎస్‌’ను తీసుకొస్తున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపాధి పథకంలో ‘ఆధార్‌ ఆధారిత వేతనాల చెల్లింపు’ (ఏబీపీఎస్‌)ను తప్పనిసరి చేస్తూ, జనవరి 1 నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘పేదలు, అణగారిన వర్గాలు, శ్రామికుల పట్ల కేంద్రం అత్యంత నిర్దయగా వ్యవహరిస్తున్నది. సాంకేతికత, సంక్షేమం కలపాలన్న అత్యుత్సాహంతో పాటించలేని బాధ్యతను పేద కార్మికులపై మోపుతున్నది’ అని నరేగా సంఘర్ష్‌ మోర్చా ఆరోపించింది. ‘ఏబీపీఎస్‌ను తప్పనిసరి చేయటం ద్వారా 8.9 కోట్లమంది, యాక్టీవ్‌ కార్మికుల్లో 1.8 కోట్లమంది పని హక్కును, వేతనాల్ని పొందే హక్కును కోల్పోతున్నారు’ అని పేర్కొన్నది.

ఐదు రాష్ర్టాల ఎన్నికలతో ఆగింది..

గత ఏడాది ఆగస్టులో ఏబీపీఎస్‌ అమలు గడువును కేంద్రం పొడిగించింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏబీపీఎస్‌’ డెడ్‌లైన్‌ను 2023 డిసెంబర్‌ 31కి మార్చింది. ఎన్నికలు పూర్తయి.. ఓట్ల అవసరం తీరడంతో కేంద్రం ఏబీపీఎస్‌ అమలు చేపట్టడాన్ని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏబీపీఎస్‌పై గత ఏడాది ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నరేగా సంఘర్ష్‌ మోర్చా సహా వివిధ సంఘాలు 60 రోజులపాటు ధర్నా చేపట్టాయి.

7.6 కోట్ల జాబ్‌ కార్డులు తొలగింపు

గత రెండేండ్లలో 7.6 కోట్లమంది రిజిష్టర్డ్‌ కార్మికులు జాబ్‌ కార్డ్‌ కోల్పోయారు. దీంతో వీరంతా పని హక్కును కోల్పోయారు. ఏబీపీఎస్‌ (ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానం)ను తప్పనిసరి చేయటం ద్వారా 2022-23లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాబ్‌ కార్డులను తొలగింపునకు తెరలేపింది. మొత్తం కార్మికుల్లో 87.52 శాతం యాక్టివ్‌ వర్కర్స్‌ మాత్రమే ఏబీపీఎస్‌కు అర్హులవుతున్నారు. గత 11 నెలల్లో 12.5 శాతం మంది అనర్హులయ్యారు.

జాబ్‌ కార్డులు కోల్పోయినవారు

2021-22లో 4.74 శాతం
2022-23లో 19 శాతం
2023-24లో 7.72 శాతం
దేశంలో ఉపాధి హామీ కార్మికులు 25.69 కోట్లమంది
యాక్టివ్‌ వర్కర్స్‌ 14.33 కోట్లమంది