
Disability Pension : అనంతగిరి,జూన్ 16, (త్రినేత్రంన్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వాలసి పంచాయతీ గంగుడివలస గ్రామానికి చెందిన వెలగ కొత్తన్న గత ఎనిమిదేళ్లుగా రెండు కాళ్లలో కుడి కాలు పూర్తిగా కోల్పోయి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. వికలాంగుల పింఛన్ కోసం పలుమార్లు సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాళ్లు కోల్పోవడంతో ఉపాధి అవకాశాలు లేకపోయాయని, చేతిలో పని లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆయన తెలిపారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా మారిందని, భార్యా పిల్లలతో కలిసి అర్థాకలితో జీవనం సాగిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో వ్యవసాయ పనులు చేయలేకపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేని దుస్థితి నెలకొందని కొత్తన్న వాపోయారు. గతంలో వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.
గత వైయస్సార్ ప్రభుత్వ హయాంలో సమర్పించిన దరఖాస్తులు కార్యాలయాలకే పరిమితమయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అయినా తన సమస్యను పరిష్కరించి వికలాంగుల పింఛన్ మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తన పరిస్థితిని గుర్తించి తక్షణమే వికలాంగుల పింఛన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెలగ కొత్తన్నకు అధికారులు వెంటనే వైద్య ధ్రువీకరణ, అర్హత పరిశీలన పూర్తి చేసి పింఛన్ మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe