Tight Security : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

TRINETHRAM NEWS

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS (144 సెక్షన్) అమలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలసత్వం వహించవద్దు

— మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్

Trinethram News : మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్, కురవి, సీరోల్, మరిపెడ, గంగారం, కొత్తగూడ మండలాల్లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా (05) డీఎస్పీలు, (15) సీఐలు, (50) ఎస్‌ఐలు, సుమారు 1000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో రూట్లుగా విభజించి, ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందించేలా సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన రౌడీషీటర్లు, ట్రబుల్ మేకర్లను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియకు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, వారి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని, ఒకసారి కేసులు నమోదైతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోనుకాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.

ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని, ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నియమాలు అమల్లో ఉంటాయని వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంక్ బాటిళ్లు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, బాణాసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డా. శబరీష్ హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tight security arrangements for Gram Panchayat elections

You cannot copy content of this page

Scroll to Top