TRINETHRAM NEWS

ఎన్నికల యుద్దానికి…వైస్సార్ సీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సిద్ధం… అంటూ భారీ సభలు ఏర్పాటు చేయడంతో… టీడీపీ – జనసేన సంసిద్ధం..అంటూ తాడేపల్లిగూడెం వేదికగా శంఖారావం…ఇక యుద్ధం కి సమయం అసన్న మైంది అంటున్నారు ..రాజకీయ నిపుణులు

వైసీపీ సిద్ధం సభలకు ధీటుగా తెలుగుదేశం – జనసేన పార్టీలు నేడు తాడేపల్లిగూడెంలో తొలి ఉమ్మడి బహిరంగసభ నిర్వహించనున్నాయి.

భారీ బహిరంగ సభకు 6 లక్షల మంది తరలివస్తారని అంచనావేస్తున్నారు.

ఇందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ సభా వేదికపై నుంచి భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటించనున్నారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.

సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తాడేపల్లిగూడెం సభ వేదికగా తెలుగుదేశం – జనసేన కూటమి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పొత్తుల అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కోసం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారికి ఆనుకుని వున్న 25 ఎకరాల భూమిలో సభా ప్రాంగణం సిద్ధమైంది. సభకు తెలుగు జన విజయకేతనం అని పేరు పెట్టారు. సభా వేదికపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో కూడిన భారీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు.

భారీ బహిరంగ సభకు టీడీపీ, జనసే పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ హాజరు కానుండడంతో అంచనాలకు మించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా బ్లాక్‌లు కేటాయించారు. సభ సక్రమంగా సాగేందుకు దాదాపు వెయ్యిమంది వలంటీర్లను నియమించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం 500 మంది వలంటీర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. రెండు హెలికాప్టర్లలో చంద్రబాబు, పవన్‌ సభకు చేరుకుంటారు. సభా వేదికగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

మరోవైపు సభా ప్రాంగణాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ ఇప్పటికే సందర్శించారు. సభ విజయవంతమౌతుందని ధీమా వ్యక్తం చేశారు ఇద్దరు నేతలు. మొత్తానికి తాడేపల్లిగూడెం సభను సక్సెస్‌ చేయడం ద్వారా సత్తా చాటుకోవాలని టీడీపీ-జనసేన భావిస్తున్నాయి.