
వాషింగ్టన్: యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్ కెర్ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.
‘డ్రగ్’ మోతాదు ఎక్కువ కావడంతోనే ట్రోపర్ మరణించి ఉంటాడని ఆయన బామ్మ ఎస్తర్ వోజ్కికీ అనుమానం వ్యక్తం చేశారు. ‘‘అతను డ్రగ్ తీసుకున్నాడు. అందులో ఏముందో మాకు తెలియదు. అది డ్రగ్ అని మాత్రం చెప్పగలం’’ అని తెలిపారు. శవపరీక్ష నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించారు. అతని మరణంతో తమ కుటుంబం తీవ్ర విశాదంలో మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గణితం పట్ల అతనికి చాలా ఆసక్తి అని.. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవాడని తెలిపారు.
