TRINETHRAM NEWS

Trinethram News : కొత్తపల్లి: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన మూడో రోజుకు చేరింది. కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైపు లైన్లను తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు..

యు.కొత్తపేట మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకార కుటుంబాలు కాకినాడ-అద్దరిపేట రహదారిపై బైఠాయించాయి. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వ్యర్థాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని.. తమ జీవనోపాధిని దెబ్బతీసే పైపు లైన్లను తక్షణమే తొలగించాలని నినాదాలు చేశారు. మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బోటును తగలబెట్టి నిరసన తెలిపారు. కొందరు ఆందోళనకారులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు వారిని అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది..