
అందరికీ ధన్యవాదాలు : శ్రీరామ ఉత్సవ సమితి
Trinethram News : రాజమహేంద్రవరం, ఏప్రిల్ 7: శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ శోభాయాత్ర పేరిట నగరంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతం అయిందని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ.రామ రాజు , ఉపాధ్యక్షులు రామ్ కుమార్ రామదేవ్ ఆనందం వ్యక్తంచేసారు. గతం కంటే ఎక్కువగా భక్తులు ర్యాలీలో పాల్గొన్నారని, తిలకించడానికి కూడా పెద్ద సంఖ్యలో జనం విచ్చేశారని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన్నారు. స్థానిక జాంపేట గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప జిల్లా బ్రహ్మo గారి మఠము అధిపతి విరజానంద స్వామి, అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసారని రామరాజు తెలిపారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, తదితర ప్రముఖులు, అలాగే పోలీసు అధికారులు విచ్చేసారని ఆయన చెబుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది పురుషులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసారని, రామరాజు పేర్కొంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మీడియా అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
రామ్ కుమార్ రామ్ దేవ్ మాట్లాడుతూ పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో 25వేల బైక్ లపై 45వేలమందికి పైగా పాల్గొన్నారని, 13. 27కిలోమీటర్ల పొడవునా, దాదాపు 20జంక్షన్ల మీదుగా సాగి తిరిగి పుష్కర్ ఘాట్ కి ర్యాలీ చేరిందని వివరించారు. ద్వారకా తిరుమల, అన్నవరం రథాలు, ఛత్రపతి శివాజీ రథం ర్యాలీలో పాల్గొన్నాయన్నారు. ఎక్కడికక్కడ ప్రజలు మంచినీళ్లు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, ప్రసాదాలు అందించారని ఆయన చెప్పారు. నగరమంతా ఒక ఉత్సవంగా సాగిందని, సమితిని ఈ నగరం దత్తత తీసుకున్నట్లుగా భావిస్తూ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. 300మంది వాలంటీర్లు 40రోజులపాటు శ్రమించారని, మరో 500 నుంచి 700మంది మొత్తం మీద వేయిమంది వాలంటీర్లు సేవలు అందించారని ఆయన చెప్పారు. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మరింత కట్టుదిట్టంగా ర్యాలీ నిర్వహించడానికి సన్నద్ధం అవుతామని రామ్ దేవ్ చెప్పారు. కార్యదర్శి యడ్లపల్లి అయ్యప్ప, కార్యవర్గ సభ్యులు గండేపూడి.సురేష్, కర్రి శ్రీనివాస్, కొత్త.సత్య, దినేష్ లాల్, రమణ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
