TRINETHRAM NEWS

‘’గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలి

_ జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌

‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్‌ దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వైరా మండలం జింకలగూడెం, తాటిపుడి గ్రామంకు చెందిన ఎస్‌.కె. లాల్‌బీ తన సదరన్‌ సర్టిఫికేట్‌లో ఫోటో, ప్రభుత్వ అధికారుల సంతకాలు ప్రింటు కాలేదని సరిచేయించగలరని, తనకు ట్రైసైకిల్‌ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. నేలకొండపల్లి బిసి, ఎస్సి కాలనీకి చెందిన కొప్పుల వెంకటరామిరెడ్డి తన కుమార్తె కొప్పుల రమాదేవికి మార్చి, 2023లో వివాహం అయినందున రేషన్‌ కార్డులో తన కూతురు పేరును తొలగించగలరని కోరగా, కుమార్తెకు బదులుగా తన భార్య కొప్పుల జానకీ పేరును తొలగించారని అట్టి తప్పిదంను సరిచేయ గలరని సమర్పించిన దరఖాస్తును, కల్లూరుకు చెందిన టి. శీరీష రేషన్‌ నియామక పరీక్షలో తనకు అన్యాయం జరిగిందని, తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగిందని, తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన బి. పద్మకుమారి తన కుమార్తె భూక్యా శ్రీలేఖకు మే, 2023న వివాహం జరిగినదని, కళ్యాణలక్ష్మీ మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తిరుమలాయపాలెం తహశీల్దారును ఆదేశించారు. ఖమ్మం నగరం రమణగుట్టకు చెందిన జి. నాగేంద్ర తనకు గల రెండు గదుల ఇంటికి రూ. 322 లు ఇంటిపన్ను చెల్లించడం జరిగేదని, నగరపాలక సంస్థ వారు మరల రూ. 32,299లు ట్యాక్స్‌ కట్టాలని తెలిపారని, విచారణ చేసి అట్టి ఇంటి పన్ను తగ్గించగలరని సమర్పించిన దరఖాస్తును నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరం రిక్కాబజర్‌కు చెందిన దుగ్గిరాల వెంకన్న తన మనవరాలు ఉషశ్రీ కి తండ్రి లేడని, ఎలాంటి ఆధారం లేదని తనకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మం ఆర్భన్‌ తహశీల్దారును కలెక్టర్‌ ఆదేశించారు. సత్తుపల్లికి చెందిన పఠన్‌ పాషా తన కాళ్ళు చేతులు పడిపోయినానని ఏ జీవనాధారం లేదని తనకు పెన్షన్‌ మంజూరు కావడం జరిగిందని కాని పెన్షన్‌ జమ కావడం లేదని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తహశీల్దారును కలెక్టర్‌ ఆదేశించారు. తన ఆరోగ్యం బాగు లేనందున చికిత్స చేయించాలని కోరగా, వెంటనే స్పందించిన కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, డిసిహెచ్ఎస్ లను చర్యలకై ఆదేశించగా, అంబులెన్స్ రప్పించి, ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కు తరలించడం జరిగింది. పిడిఎస్‌యు ప్రతినిధి బృందం పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ విడుదల చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సాంఫీుక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. తల్లాడ మండలం మల్లవరం గ్రామంకు చెందిన దుగ్గిదేవర సామ్రాజ్యం మల్లవరం సర్వేనెం. 525/అ నందు 8 ఎకరాల భూమికి ఎన్‌ఓసి ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును, పెనుబల్లి మండలం చింతగూడెంకు చెందిన కొమ్మురమేష్‌ చింతగూడెం సర్వేనెం. 71/5 0.20 కుంటల భూమికి 1984లో పట్టా ఇవ్వడం జరిగినదని, ప్రభుత్వం స్వాధీనపర్చుకోవడం జరిగిందని, తిరిగి తనకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారికి సూచించారు.

 అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ పెండింగ్ గ్రీవెన్స్ దరఖాస్తులపై సమీక్షించారు. ఇప్పటివరకు 1262 దరఖాస్తులు రాగా, 953 దరఖాస్తులు పరిష్కరించినట్లు, 219 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, 90 దరఖాస్తులు పరిష్కారానికి ఇతర సంబంధిత శాఖలకు ఫార్వార్డ్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఫార్వార్డ్ చేసిన దరఖాస్తుల పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయన అన్నారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి జి. గణేష్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.