
Search Operations : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 25 ; అమలాపురం ప్రాంతానికి చెందిన గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత తీర రక్షక దళం (ఐ సి జి), నౌకాదళం, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయోగి కేంద్ర రక్షణ మంత్రిని కలిసి గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై చర్చించారు.
అనంతరం కేంద్ర రక్షణ మంత్రిత్వ భారత తీర రక్షక దళాన్ని మరింత అప్రమత్తం చేసిందని మంత్రి తెలిపారు. ఐసీజీ ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) ఆదేశాల మేరకు కోల్‌కతాలోని తూర్పు, ఈశాన్య కమాండ్లను కూడా కార్యాచరణలోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గాలింపు పరిధిని విస్తరించి, ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు సమీప సముద్ర జలాల్లో ఉన్న 15 ఐసీజీ నౌకలు, నాలుగు హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మెరైన్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్( యం.ఆర్ సి సి) ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ నిఘా ఏకకాలంలో కొనసాగుతోందన్నారు.
గల్లంతైన పడవకు సంబంధించిన సమాచారం లేదా ఆచూకీ లభించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మయన్మార్, బంగ్లాదేశ్ సముద్ర అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పడవ విదేశీ జలాల్లోకి కొట్టుకుపోయి ఉండవచ్చనే అవకాశంతో పాటు, ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా సముద్రంలో ఎక్కడైనా నిలిచిపోయి ఉండవచ్చన్న కోణంలోనూ భారత తీర రక్షక దళం పరిశీలన జరుపుతోందని మంత్రి వివరించారు. ఎంఆర్‌సీసీ చేపడుతున్న ఎలక్ట్రానిక్ నిఘాతో పాటు వివిధ సముద్ర అధికారుల నుంచి అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నట్లు చెప్పారు.
సముద్ర ప్రవాహాలు, గాలుల దిశ, వేగం, వాతావరణ పరిస్థితులతో పాటు మత్స్యకారులు సాధారణంగా చేపల వేటకు వెళ్లే మార్గాలను పరిగణనలోకి తీసుకుని గాలింపు కొనసాగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. డైమండ్ హార్బర్, సుందర్‌బన్స్‌తో పాటు పరిసర సముద్ర ప్రాంతాల్లోనూ సెర్చ్ ఆపరేషన్‌ను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటోందని అచ్చెన్నాయుడు చెప్పారు. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe