సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..!!
Trinethram News : సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ప్రస్తుత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగుస్తున్నది. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు సీజేఐగా ఎంపికైన జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. 2025 మే రెండో వారం వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా వ్యవహరిస్తారు.
ఖన్నా కుటుంబ సభ్యుల నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సంజీవ్ ఖన్నా మూడో వ్యక్తి. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేసిన దేవీరాజ్ ఖన్నా కొడుకే సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు సమీప బంధువు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పలు చారిత్రక తీర్పులు ఇచ్చిన వారిలో ఒకరు. ఈవీఎంల పవిత్రతతోపాటు ఎన్నికల బాండ్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ వంటి కేసుల్లో తీర్పులు ఇచ్చారు.
1960 మే 14న జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. నేషనల్ లీగల్ సర్వీస్ అధారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పని చేశారు. 1983లలో న్యాయవాదిగా ఢిల్లీ బార్ కౌన్సిల్ లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత తీస్ హజారీ కాంప్లెక్సులోని జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సుదీర్ఘకాలం ఆదాయం పన్ను విభాగం సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా కొనసాగిన సంజీవ్ ఖన్నా.. 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ స్టాండింగ్ కౌన్సిల్ (సివిల్)గా నియమితులయ్యారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన సంజీవ్ ఖన్నా.. తదుపరి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.
ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా వైదొలుగుతున్న డీవై చంద్రచూడ్ శుక్రవారం నలుగురు న్యాయమూర్తుల బెంచ్ కు సారధ్యం వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎనిమిదేండ్ల చరిత్రలో రికార్డు స్థాయిలో 38 రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. గత రెండేండ్లుగా 21,358 కేసుల్లో బెయిల్ తోపాటు 1.07 లక్షల కేసులను పరిష్కరించారు. చివరి పనిదినం శుక్రవారం తన కెరీర్ లో చేపట్టిన విషయాలను వెల్లడించారు. జస్టిస్ చంద్రచూడ్ సేవలను సీజేఐగా ఎంపికైన జస్టిస్ రాజీవ్ కన్నా, అటార్నీ జర్నల్, సొలిసిటర్ జర్నల్, సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబాల్ ప్రశంసించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App