జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 14 at 11.19.36

TRINETHRAM NEWS

Trinethram News : భయపడి ఇంటికి వెళ్లిపోయిన జూనియర్ విద్యార్థులు .. రామగుండం మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత .. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థుల ఆందోళన

కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తరచుగా జూనియర్ విద్యార్థులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం వైద్య కళాశాలలో సీనియర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి జూనియర్ల హాస్టల్ రూమ్ లలోకి చొరబడి వేధింపులకు గురిచేశారు. ఇద్దరు విద్యార్థులకు గుండ కొట్టి, మీసాలు తొలగించారు. దీంతో భయాందోళనకు లోనైన ఆ విద్యార్థులు తెల్లారి ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ల ఆగడాలతో విసిగిపోయిన జూనియర్ విద్యార్థులు మంగళవారం కాలేజీలో ఆందోళన చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు బైఠాయించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

రామగుండం మెడికల్ కాలేజీలో కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ, కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు విద్యార్థుల గదుల్లోకి సోమవారం రాత్రి సీనియర్లు మూకుమ్మడిగా చొరబడ్డారు. జూనియర్లను ప్రశ్నలతో వేధిస్తూ జుట్టు అంతలా ఎందుకు పెంచారని నిలదీశారు. అనంతరం ట్రిమ్మర్ తో గుండు చేసి, మీసాలు కూడా తొలగించారు. వారితో పాటు మరో ముగ్గురు విద్యార్థులను కూడా ర్యాగింగ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని ఫోన్ లో తమ తల్లిదండ్రులకు వివరించిన స్టూడెంట్లు.. ఉదయాన్నే ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేస్తున్న ఆగడాలతో విసిగిపోయిన జూనియర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసి కాలేజీకి వెళ్లిన గోదావరిఖని పోలీసులు.. ర్యాగింగ్ ఘటనపై జూనియర్లను విచారించారు. దీనిపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వివరించారు.

You cannot copy content of this page