TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వీటి ధరలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
‘‘భారత్‌ వెలుపల ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు (యుద్ధాలను ఉద్దేశిస్తూ) మెరుగుపడనివ్వండి. అప్పుడే చమురు ధరల్లో స్థిరత్వం వస్తుంది. ఆ తర్వాత పెట్రోల్‌ , డీజిల్‌ ధరల తగ్గింపుపై దృష్టి సారించగలం. అయితే, ప్రపంచంలో ఎక్కడో ఓచోట దాడులు జరిగినా సరకు రవాణా, బీమా ధరలు పెరుగుతున్నాయి. దీంతో చమురు మార్కెట్‌లో అస్థిరతలు నెలకొంటున్నాయి’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్‌ పోరు, గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం, ఎర్ర సముద్రంలో హూతీల దాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇటీవల ముడి చమురు ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు నెలకొన్నాయి. అయినప్పటికీ.. గత 23 నెలలుగా మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
2021 నుంచి కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించి.. ప్రజలకు ఊరట కల్పించిందని హర్‌దీప్‌ సింగ్‌ పురి ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈ తగ్గింపుతో కేంద్రం దాదాపు రూ.2.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయిందన్నారు.