
PESA Forum Rally : అరకులోయ, జూలై 31, (త్రినేత్రం న్యూస్): ఆదివాసుల భూ హక్కులకు రక్షణ కల్పించే 1/70 చట్టాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని, జీఓ–3కు ప్రత్యామ్నాయంగా ఆదివాసులకు 100 శాతం నియామక రిజర్వేషన్ కల్పించే జీవోను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండల కేంద్రంలో పెసా ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
పెసా ఫోరం అరకువేలి మండల అధ్యక్షుడు సుంకరి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ పెసా ఫోరం అధ్యక్షుడు పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, జీఓ–3కు ప్రత్యామ్నాయంగా ఆదివాసులకు 100 శాతం నియామక రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి రెండేళ్లు గడిచినా అమలు జరగలేదని విమర్శించారు. ఆదివాసి సంఘాలతో సమావేశాలు, అభిప్రాయ సేకరణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
ఆదివాసులకు 100 శాతం నియామక రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించి వెంటనే చట్టబద్ధ చర్యలు చేపట్టాలని, అప్పటివరకు షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రభుత్వ నియామక నోటిఫికేషన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టం ఆదివాసుల భూ హక్కులకు రక్షణ కవచమని పేర్కొన్న ఆయన, ఆ చట్ట పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. అలాగే ఎల్‌టీఆర్ కేసులను సుమోటోగా నమోదు చేసి వేగవంతంగా పరిష్కరించాలని, షెడ్యూల్ ప్రాంతాల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి ఆదివాసుల భూములకు పూర్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, అరకువేలి, హుకుంపేట, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 2, 13, 29, 51లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పెసా చట్టం, 1/70 చట్టం, ఐదవ షెడ్యూల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆదివాసుల అడవులు, భూములు, నీటి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు.
హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసుల జీవనాధారాలను దెబ్బతీయొద్దని, పెసా కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులను గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పెసా ఫోరం అరకువేలి మండల కార్యదర్శి కిల్లో జగన్నాథం, కోశాధికారి మోసియా రంజిత్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం. రమేష్, సహాయ కార్యదర్శి రవి, రామన్న, మల్లన్న, గురుమూర్తి, బాలరాజు, నర్సింగరావు, మోహన్, స్వామి, బలరాం, నాగులు, కోటేశ్వరరావుతో పాటు మండలంలోని 14 పంచాయతీల పెసా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe