
హైదరాబాద్: కంటోన్మెంట్ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లాస్య.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న కారు ముందుగా టిప్పర్‌ను ఢీకొని ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా టిప్పర్.. కారును ఢీకొందా?లేదా కారు టిప్పర్‌ను వెనక నుంచి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
