ఆదివాసీ డిఎస్సీపై స్పష్టమైన ప్రకటన కోరుతున్న గిరిజన సంఘాలు
అల్లూరి జిల్లా, అరకువేలి, త్రినేత్రం న్యూస్ జూన్ 21: ఆదివాసీ ప్రాంతాల్లో 100 శాతం ఉపాధ్యాయ, ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 21న జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. గిరిజన రిజర్వేషన్ చట్టంపై ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేయాలని కోరింది. అరకువేలి మండలంలోని గిరిజన సంఘం భవనంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల కార్యదర్శి జి.బుజ్జిబాబు, ఉపాధ్యక్షులు కిల్లో జగనాధం, టి.జోషి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించేలా ప్రత్యేక చట్టం రూపొందించాలన్నారు. మే 13న సీఎం ప్రకటించిన హామీ ప్రకారం గిరిజనులకే ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
మేగా డిఎస్సీ ప్రకటన నుంచి ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి, ప్రత్యేక ఆదివాసీ డిఎస్సీకి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
గతంలో దశలవారీగా చేపట్టిన ఆందోళనలు, విజ్ఞాపనల ఫలితంగా ముఖ్యమంత్రి స్పందించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సీఎం హామీ ప్రకటనను యోగా దినోత్సవం రోజే ప్రకటించాలని స్పష్టంచేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


