TRINETHRAM NEWS

Trinethram News : ద్వారకాతిరుమల, తేది: 07.03.2024.

రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించేలా మహిళల స్థితిగతులను పెంచేందుకు, జీవనోపాధులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ ప్రతి పథకంలో స్త్రీ కీలక పాత్ర పోషించేలా జగనన్న ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. బుధవారం ద్వారకా తిరుమల మండలంలోని కొమ్మర, రాళ్ళకుంట, సత్తెనగూడెం, ద్వారకా తిరుమల, దొరసానిపాడు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాలను హోంమంత్రి అధ్యక్షతన  నిర్వహించారు. రాళ్ళకుంట, ద్వారకా తిరుమల గ్రామాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలతో కలిసి భారీ కేక్ లను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. గ్రామాల పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.   ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ప్రతిరోజు మహిళా దినోత్సవమే అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పేదరిక నిర్మూలనకు దీర్ఘకాలిక ప్రణాళికతో ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం.. చక్కటి చదువు కోసం జగనన్న మన పిల్లల కోసం విశేషమైన కృషి చేస్తున్నారన్నారు.  ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి  అమలు చేసిన పథకాల ద్వారా రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుండి 6 శాతానికి తగ్గిందన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటివద్దకే అందించారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కులమతాలకు, పార్టీలకు అతీతంగా నవరత్నాల పథకాలను ప్రతి ఇంటికీ అందించారన్నారు. అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు సంక్షేమం అందించిన ఏకైక సీఎం జగన్ అని అన్నారు. జగనన్న పాద యాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లిస్తేనే పథకాలు అందేవని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడిన వైనం, జగనన్న పాలనలో ప్రజలు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న వైనాన్ని బేరీజు వేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి కుటుంబానికి నేడు ఆర్థిక చేయూత లభించిందని ఆమె చెప్పారు. నేడు ప్రతి సంక్షేమ పథకం సొమ్ము నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో చేరుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలలో పెడితే ఈ పెత్తందారులందరూ కలిసి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు..? ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని నాయకులకు  దిశా నిర్దేశం చేశారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమయంలోనైనా తమ దృష్టికి సమస్యను తీసుకుని రావచ్చునన్నారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను  ప్రజలకు వివరించాలన్నారు. పుట్టింటి ఆడపడుచుగా తమ పై చూపిస్తున్న ఆదరాభిమానాలకు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు సర్వదా రుణపడి ఉంటానన్నారు. ఏ కుటుంబంలోనైనా చిన్న, చిన్న గొడవలు ఉండటం సహజమని.. వైసీపీ అనే పెద్ద కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా వెంటనే పరిష్కరించుకుంటామని తెలిపారు. పార్టీ గెలవడానికి ప్రతి గ్రామంలో కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా కృషి చేయాలన్నారు.  గోపాలపురం నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీని మళ్ళీ గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాలంటే అందరం కూడా పార్టీ కోసం కష్టపడి మళ్లీ పనిచేసి అందరితో కలిసిమెలిసి వెళ్లాలని హోంమంత్రి సూచించారు. సమావేశాల్లో  హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చిన స్థానిక సమస్యల పై తక్షణమే స్పందించి వెంటనే సంబధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.