TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు విరుచుకుపడడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది.హైదరాబాద్‌లో నిన్నరాత్రి వరకు 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో ఏప్రిల్‌ నెలలో కురిసిన రెండో అత్యధిక వర్షపాతంగా అధికారులు చెబుతున్నారు. 2015లో 105.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నిన్న రాత్రి ఆ స్థాయిలో పడింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. నగరంలో రోడ్లు చెరువులను తలపించాయి. ట్రాఫిక్‌ జామ్‌లు నెలకొనగా, పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. మలక్‌పేట్‌ ఆర్‌యూబీ, ఖైరతాబాద్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. చార్మినార్‌ పైభాగం నుంచి మినార్‌ శిథిలాలు రాలిపోవడంతో భయాందోళన నెలకొంది.

నిన్న కురిసిన వర్షానికి పిడుగులు, గోడకూలిపోవడం వంటి ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కర్నూల్, గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదనంగా, పిడుగుపాటుకు 20 మేకలు మృతి చెందాయి.

వర్షం కారణంగా మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యాదాద్రి భువనగిరి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మామిడి కాయలు నేలరాలగా, నిజామాబాద్ జిల్లాలో ధాన్యం తడిసి ముద్దయింది.

రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది.

రాష్ట్రంలో వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్‌రెడ్డి అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rains for another