ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయం చారిత్రాత్మకం
క్రిస్టియన్… ముస్లిం… మైనారిటీలకు రుణాలు మంజూరు
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ : కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రాష్ట్రంలో ఈ నెల 25 నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిర్ణయం చారిత్రాత్మకం అని అభినందించారు. స్పౌజ్ పెన్షన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారని, ఈ నెల 30లోగా సంబంధిత పత్రాలు సమర్పిస్తే, మే 1 నుంచే పింఛను జారీ చేయనున్నారని తెలిపారు. కాగా తమ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వితంతువులకు చేదోడుగా ఉందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌజ్ కేటగిరీని గతేడాది నవంబరు నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబరు 1 నుంచి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబరు 31 మధ్య ఉన్న స్పౌజ్ కేటగిరీకి చెందిన అర్హులు 89,788 మందికి మే నెల నుంచి పెన్షన్ రూ. 4000 అందజేయనున్నారని పేర్కొన్నారు. అర్హత ఉన్నవాళ్లు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అర్హురాలి ఆధార్ కార్డుతో పాటుగా మిగిలిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని, అధికార యంత్రాంగం వెరిఫై చేసి మే 1న పింఛను సొమ్ము అందజేస్తుందని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా ఆ లోపు నమోదు చేసుకోలేకపోతే.. వారికి జూన్ 1 నుంచి పింఛన్ నగదు ఇస్తారని తెలిపారు. అర్హులైన వితంతువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తోందన్నారు. ఆయా వర్గాల వారికి కార్పొరేషన్ల ద్వారా అందిస్తామన్న రుణాలను అర్హతను బట్టి అర్హులకు అందిస్తోందన్నారు. దానిలో భాగంగానే ఆర్ధికాభివృద్ధి కోసం చిన్న తరహా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు క్రిస్టియన్, ముస్లిం… మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల వారికి శుక్రవారం నుంచే రుణాలను అందిస్తోందని, రుణాలు పొందేందుకు అర్హులైన ఆయా వర్గాల వారి జాబితాను కూడా ఆన్‌లైన్లో ఉంచడం జరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


