రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ ఒకేసారి!
కుదరకపోతే రెండు దఫాల్లో పూర్తి
రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కార్ కసరత్తు
రూ.2 లక్షలలోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్
రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి.. బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్
తర్వాత బ్యాంకులకు విడతల వారీగా కట్టనున్న ప్రభుత్వం
ఎస్ఎల్బీసీ, ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు
2023 డిసెంబర్ 7 కటాఫ్ తేదీ!
రూ.28 వేల కోట్ల మేర లోన్లు ఉంటాయంటున్న బ్యాంకర్లు
ఇందులో రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలే 80 శాతం
రూ.లక్ష లోపు పంట రుణాలే ఎక్కువ
గతేడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణనలోకి తీసుకుని మాఫీ చేయాలని సర్కారు చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలను సమర్పించాలని ఎస్ఎల్బీసీని ఆదేశించింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకర్లు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో రూ.లక్ష లోపు పంట రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రుణాలే దాదాపు 80 శాతం ఉన్నట్లు గుర్తించారు. అంటే రూ.లక్ష లోపు పంట రుణాలు రూ.22 వేల కోట్ల మేర ఉన్నాయి. మిగిలినవి రూ.2 లక్షల వరకు ఉన్న లోన్లు అని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు పంట రుణాలను రూ.లక్ష లోపే ఇస్తున్నాయి. వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: రైతుల పంట రుణాల మాఫీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లను ఎలా మాఫీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లుగా ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నది. ఒకవేళ అది సాధ్యపడకపోతే కనీసం రెండు విడతల్లోనైనా రుణమాఫీ చేయాలని చూస్తున్నది. ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)తో, నిధుల కోసం ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నది. రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు రూ.25 వేల కోట్ల నుంచి 28 వేల కోట్ల మేర ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలే 80 శాతం ఉన్నట్లు తెలుస్తున్నది.
తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఒకేసారి మాఫీ చేయడంపై వివిధ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి చేస్తే రైతులపై వడ్డీ భారం పెరుగుతుందని, అసలు మాఫీ చేసిన లాభం రైతులకు దక్కదని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులపై వడ్డీ భారం పడకూడదంటే కచ్చితంగా ఒకే దఫాలో, లేదంటే రెండు దఫాల్లో రుణమాఫీ పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు, బ్యాంకర్లు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబించిందనే దానిపై పూర్తి నివేదికను అందజేసినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేండ్లపాటు ఏడాదికి రూ.6 వేల కోట్ల చొప్పున బడ్జెట్లో నిధులు చూపించింది. కానీ ఒక్కపైసా కూడా రిలీజ్ చేయలేదు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో కొంత మొత్తం రిలీజ్ చేసింది. కానీ రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ కాలేదు. పైగా వడ్డీ భారం పడింది. రూ.99 వేల లోపు పంట రుణాలు మాఫీ చేశామని గత బీఆర్ఎస్ సర్కారు ప్రకటించినా.. చాలా మంది క్రాప్ లోన్లు సగం, ఆపైన అలానే ఉండిపోయాయి. రైతులు బ్యాంకులకు వెళ్లి చూసుకుంటే.. సర్కారు రిలీజ్ చేసిన సొమ్ము వడ్డీలకే సరిపోయింది. అసలు మాత్రం అలానే ఉండిపోయింది. దీంతో రైతుల పంట రుణాలు గత సర్కారు మాదిరి మాఫీ చేస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది.
ఏటా ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేలా
క్రాప్‌లోన్ల మాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మాదిరి రైతు సాధికార సంస్థలా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రైతుల రుణాలను మాఫీ చేయాలని సర్కారు భావిస్తున్నది. కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి.. ఒకేసారి రూ.20 వేల కోట్లను నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లోకి మళ్లించాలని చూస్తున్నది. అలా రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్మును లోన్ల పేమెంట్ కింద బ్యాంకులు జమ చేసుకోనున్నాయి. తర్వాత ఏటా కొంత మొత్తం చొప్పున బ్యాంకులకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించాలని ప్లాన్ చేస్తున్నది. అలా చెల్లించాక పంట రుణాలు మిగిలితే.. ఆ మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలని అనుకుంటున్నది. ఫలితంగా ఒకేసారి ప్రభుత్వంపై భారం పడదు. అదే సమయంలో రైతులపైనా వడ్డీ భారం పడదు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు ఏడాది టైం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది. నెలకు రూ.500 కోట్ల చొప్పున ప్రభుత్వ ఖజానా నుంచి కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు చెల్లించడమా? మూడు లేదా ఆరు నెలలకోసారి ఇవ్వడమా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నది. బ్యాంకులు రైతులకు క్లియర్ చేసిన మాఫీ సొమ్మును నాలుగైదేండ్లలో ప్రభుత్వం చెల్లించనుంది.