
ప్రధాన సమస్యలపై ప్రకటన చేయలేదని ఆదివాసీ గిరిజన సంఘం ఆగ్రహం
CM Disappoints Tribals : అరకులోయ ఆగస్టు 30, (త్రినేత్రం న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో గిరిజన ప్రాంతానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు అన్నారు. అరకువేలి మండలం గన్నెల ప్రాంతంలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరైన సందర్భంగా గిరిజన సమస్యలను ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అరకువేలి మండలం బొండం పంచాయతీ కొత్తవలస గ్రామంలో మండల కార్యదర్శి గత్తుం బుజ్జిబాబు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో నూరు శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గిరిజనులకే కల్పించేలా జీవో నెం.3పై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన జీవో నెం.51, 29, 13, 2లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది బెర్రీ బోరర్ తెగులు కారణంగా నష్టపోయిన కాఫీ రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. 2019–2021 మధ్య సుమారు 1.40 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేసిన రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.60 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, డిమాండ్ ఉందని చెప్పడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
గిరిజన ప్రాంతంలో నెలకొన్న మౌలిక సమస్యలు, ఉపాధి, భూమి హక్కులు, రైతుల సమస్యలపై దృష్టి సారించకుండా జనాభా తగ్గిపోతోందని, జనాభాను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వం చెప్పడం ద్వారా సంక్షేమ పథకాల అమలుపై చేతులెత్తేసినట్లేనని వ్యాఖ్యానించారు.
గిరిజనుల ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జీవో నెం.3పై ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన జీవో నెం.51, 29, 13, 2లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో గిరిజనులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు టి.జోషి, జి.వెంకటరమణ, రవీంద్రబాబు, రామన్న, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe