TRINETHRAM NEWS

ఏసు క్రీస్తు జన్మించిన రోజును క్రైస్తవులు అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరూ ఎంతో పవిత్రంగా ఈ వేడుకలలో పాల్గొంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చీలు అన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. క్రైస్తవులు చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

అసలు క్రిస్మస్ పండుగ ప్రత్యేకత ఏమిటి? ఏసుక్రీస్తు జననం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎందుకు ఈ పండుగను చాలా స్పెషల్ గా జరుపుకుంటారు అంటే.. క్రీస్తు జననం వెనుక ఒక కథ ఉందని చెబుతారు . రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే యువతికి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనిపించాడట. ఇక ఆ దేవదూత కన్యగానే గర్భందాల్చి ఒక కుమారునికి జన్మనిస్తావని మేరీ కి చెప్పాడట…
అంతేకాదు పుట్టిన బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతను దేవుని కుమారుడని దేవదూత చెప్పాడట. ఆ తర్వాత మేరీ దేవదూత చెప్పిన విధంగానే గర్భం దాల్చింది. ఇక ఈ విషయం తెలిసిన జోసెఫ్ మేరీని వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి జోసెఫ్ కలలో దేవదూత కనబడి మేరీ భగవంతుని వరం వలన గర్భవతి అయింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడని చెప్పాడట.

అతను తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పాడు. మేరీని నువ్వు విడిచి పెట్టవద్దు అని కూడా జోసఫ్ కి చెప్పాడట. ఆ తర్వాత జోసెఫ్, మేరీ ఇద్దరూ తమ స్వగ్రామమైన బెత్లెహేమ్ కు వెళ్లగా అక్కడ వారు ఉండడానికి కనీసం వసతి దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని తన గొర్రెల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడట…
అక్కడ మేరీ ఏసుక్రీస్తుకు జన్మనిచ్చింది. అలా రెండు వేలకు పైగా సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత అంటే డిసెంబర్ 25 న ఏసుక్రీస్తు జన్మించాడు. ప్రజలను కాపాడేందుకు పుట్టిన క్రీస్తు జన్మదినం రోజున క్రిస్మస్ వేడుకగా క్రైస్తవులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు.