
Chief Minister Must Announcement : అరకులోయ ఆగస్టు 28, (త్రినేత్రం న్యూస్): అరకు వేలి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం గన్నెలలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివాసులకు నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. అరకు వేలిలోని గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం జిల్లా నాయకుడు జగన్నాధం, మండల నాయకుడు సహదేవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఆదివాసులకు ఇచ్చిన హామీ మేరకు శత శాతం రిజర్వేషన్‌పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని బాలదేవ్ కోరారు. జీవో నంబర్ 3 రద్దు కావడంతో ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, 2025 మెగా డీఎస్సీలో సుమారు ఐదువేల ఉపాధ్యాయ పోస్టులను ఆదివాసులు కోల్పోయారని పేర్కొన్నారు. రిజర్వేషన్ అంశంపై చర్చలు, సమావేశాలు, కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు.
2026 డీఎస్సీని అక్టోబర్‌లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో డీఎస్సీకి ముందే ఆదివాసులకు శతశాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేయకుండా డీఎస్సీ నిర్వహిస్తే ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. సీఎం గన్నెల పర్యటనలోనే ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
1/70 చట్టానికి రక్షణ కల్పించాలి…. 1/70 చట్టం సవరణను కోరుతూ 2023లో 1,672 మంది గిరిజనేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని బాలదేవ్ తెలిపారు. ఆదివాసుల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని పరిరక్షిస్తూ ఆదివాసుల భూములకు భద్రత కల్పించాలని కోరారు.
హైడ్రో పవర్ ప్రాజెక్టులు రద్దు చేయాలి…. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుజ్జలి, పెదకోట, చిట్టంవలస, ఎర్రవరం, సీలేరు ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 13, 51, 2, 29లను రద్దు చేయాలని బాలదేవ్ డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని అడవులు, భూములు, నీటి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ఆదివాసుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేయాలని కోరారు.
పీఎం జన్మన్ నిధులు విడుదల చేయాలి… అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 1,650 పీవీటీజీ గ్రామాల్లో పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష పెంచుతూ జీవో జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కాలేదని బాలదేవ్ ఆరోపించారు. పెంచిన మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాల్లో 12 రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఒక్క గ్రామాన్ని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. సీఎం అరకు పర్యటన సందర్భంగా 100 శాతం రిజర్వేషన్‌తో పాటు ఆదివాసుల హక్కులు, చట్టాల పరిరక్షణ, పీఎం జన్మన్ నిధుల విడుదల, హైడ్రో పవర్ ప్రాజెక్టుల రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలను ప్రకటించాలని పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe