Case Registered : ఫోరెన్సిక్ ల్యాబ్‌ అగ్నిప్రమాదంపై కేసు నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొ రేటరీలో జరిగిన అగ్నిప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు ఎవిడెన్స్‌కు సంబంధించిన కార్యాలయాల్లో అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. వివిధ నేర పరిశోధన కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు, ఫైళ్లు, డిజిటల్ డేటా నిల్వ ఉంచిన విభాగాలే మంటల్లో దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. స్టోర్ చేసి ఉంచిన మెటీరియల్ మొత్తం కాలిపోయి బూడి దైనట్టు సమాచారం.

అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. అయితే, అసలు ఏఏ వస్తువులు తగులబడ్డాయి, ఎంతమేర నష్టం జరిగింది అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో కంప్యూటర్లు, డిజిటల్ ఎవిడెన్స్‌కు సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు.

నేర పరిశోధనకు సంబంధించిన ఫైళ్లు, ఎవిడెన్స్ ల్యాబొరేటరీ ఆపరేషన్లు ఈ కార్యాలయం నుంచే నిర్వహించేవారని చెప్పారు. దీంతో ఈ అగ్నిప్రమాదం అనేక కీలక కేసులపై ప్రభావం చూపే అవకాశముందని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాము.

తీవ్ర ప్రయత్నాల తర్వాత మంటలు నియంత్రణలోకి వచ్చాయని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్‌లో నలుగురు ఉద్యోగులు ఉన్నారని, మంటలు గమనించిన వెంటనే వారు సురక్షితంగా బయటకు వచ్చినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో అక్కడ పని చేస్తున్న ఒక వార్డు బాయ్ మంటలను గమనించి ఆర్పేందుకు ప్రయత్నించగా స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు.

అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం వెనుక అధికారులది ఏమైనా నిర్లక్ష్యం ఉందా, భద్రతా ప్రమాణాలు పాటించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టపరిణామాలపై విచారణ పూర్తయ్యాక మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Case registered in forensic lab fire

You cannot copy content of this page

Scroll to Top