ఎన్నికల వేళ.. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి..
ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. కొందరు టీడీపీ గూటికి చేరితే.. మరికొందరు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక, ఎప్పటి నుంచి వైసీపీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం సాగుతూ వచ్చింది.. ఆయన సిట్టింగ్ స్థానం మార్చిన తర్వాత.. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.. ఇక, ఆ తర్వాత అనూహ్యంగా కేబినెట్ భేటీకి హాజరైన ఆయన.. కొంత సమయం తర్వాత టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి..
మొత్తంగా మంగళవారం రోజు మంత్రి గుమ్మనూరు జయరాం.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. ఇవాళ లేదా రేపు ఉదయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి జయరాం రాజీనామా చేస్తారని సమాచారం. ఇవాళ రాత్రికే విజయవాడ చేరుకోనున్నారట గుమ్మనూరు.. ఇక, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలను కూడా తనతోపాటు విజయవాడకు ఆహ్వానించారట.. గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఖరారైందని ఆయన ప్రచారం చేసుకుంటున్నా.. ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం దీనిపై స్పష్టత ఇవ్వలేదు.. అయితే, రేపు ప్రకటించే టీడీపీ జాబితాలో గుమ్మనూరు జయరాం పేరు ఉంటుందా..? ఉండదా? అనేది ఉత్కంఠగా మారింది