Araku Fest : ప్రకృతి ఒడిలో పర్యాటకులకు పండగ అరకు ఫెస్ట్ కు సర్వం సిద్ధం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ జనవరి 28, (త్రినేత్రంన్యూస్): ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకులకు శుభవార్త. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ‘అరకు ఫెస్ట్ 2026’ అట్టహాసంగా జరగనుంది. గతేడాది ‘చలి అరకు ఫెస్టివల్’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, గిరిజన సంస్కృతి, అరకు అందాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ తెలిపారు.
మంగళవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను అధికారికంగా ప్రారంభిస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చొంపి గ్రామాన్ని సందర్శించి, అక్కడ అమలవుతున్న హోమ్‌స్టే పాలసీని పరిశీలించనున్నారని తెలిపారు. గిరిజన ఇళ్లలో పర్యాటకుల బస, వారి ఆతిథ్యంపై ముఖ్యమంత్రి స్వయంగా గిరిజనులతో చర్చించనున్నట్లు వెల్లడించారు.
సాహస క్రీడలు ప్రత్యేక ఆకర్షణ పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతి అందించేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మాడగడ ప్రాంతంలో పారా గ్లైడింగ్, పారా మోటరింగ్, హెలికాప్టర్ (చాపర్) రైడ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ అందుబాటులోకి తెస్తున్నారు. వైజాగ్ టీమ్ ఆధ్వర్యంలో తొలిసారిగా స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
గాలి కొండ, సుంకరమెట్ట ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారని, జనవరి 31న 5K రన్ (అరకు మారథాన్) కూడా ఉంటుందని చెప్పారు. గిరిజన కార్నివాల్ హస్తకళా స్టాల్స్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల గిరిజన తెగలు తమ సంప్రదాయ నృత్యాలు, కళలతో భారీ కార్నివాల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ నుంచి వచ్చే కళాకారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. గిరిజన హస్తకళా వస్తువులను పర్యాటకులు రాయితీ ధరలకు కొనుగోలు చేయవచ్చని చెప్పారు.
పద్మాపురం గార్డెన్స్‌లో ఫ్లవర్ షో, సరికొత్త ‘అరకు బొకే’ ఆవిష్కరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలిపారు. రుచికర గిరిజన వంటకాలు – సంగీత సంబరం తిరుపతి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ సహకారంతో గిరిజన వంటకాలను ప్రత్యేకంగా అందించనున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుండగా, ప్రముఖ గాయని సునీత గారి లైవ్ కాన్సర్ట్ కూడా ఉండనుంది. ముగింపు వేడుకల సందర్భంగా ఫిబ్రవరి 1న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ గారి లైవ్ షోతో పాటు అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ‘శ్రేయాస్ మీడియా’ ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మారథాన్, సైక్లింగ్ పోటీలకు పర్యాటకులు ఆన్‌లైన్ లేదా QR కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు .ఈ పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ అభిషేక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

All set for Araku Fest

You cannot copy content of this page

Scroll to Top