
Aidwa Demands : అరకులోయ మార్చి 26, (త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో, తక్షణ చర్యలు తీసుకుని సరఫరా పునరుద్ధరించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ మేరకు అరకు వ్యాలీ మండలంలోని సుంకరమెట్ట, బంగ్లవలస గ్రామాల్లో గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లూరి జిల్లా నాయకురాలు వివి జయ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయిల్,అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతూ, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గత 20 రోజులుగా జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ముందస్తుగా ఆన్‌లైన్ బుకింగ్‌పై సూచనలు చేసినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతో చాలామంది గ్యాస్ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మార్కెట్లో కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు గ్యాస్ అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గ్యాస్ కొరత కారణంగా హాస్టళ్లు మూతపడటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హోటళ్లు మూతపడటంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. అలాగే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై ఆధారపడిన కార్మికులు కూడా పని లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కేవైసీ, ఓటీపీ విధానాల ద్వారా గ్యాస్ బుకింగ్ ప్రక్రియ సామాన్యులకు క్లిష్టంగా మారిందని, యథావిధిగా సరళమైన విధానంలో గ్యాస్ సరఫరా చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని గ్యాస్ కొరతను నివారించి, అందుబాటు ధరల్లో సరఫరా కొనసాగించాలని కోరింది. లేకపోతే గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ మండల కార్యదర్శి కె. శశికళ, జిల్లా ఉపాధ్యక్షులు దేవుడమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సన్యాసమ్మ దేవి, మండల కమిటీ సభ్యులు తుల చిన్నాలమ్మ, భవాని తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

