జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Branded Items

నాణ్యమైన వస్త్రంతో యూనిఫాం … మన్నికైన బూట్లు, బెల్టులు, బెడ్డింగ్‌ సామగ్రి, స్కూలు బ్యాగులు… తొలిసారిగా జూనియర్‌ కళాశాల విద్యార్థులకూ అందజేత.. రూ.687 కోట్లు వెచ్చిస్తున్నాం

వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం… 6-12 తరగతి డేస్కాలర్‌ విద్యార్థినులకు ఇచ్చే యూనిఫాం, విద్యార్థుల డ్రెస్‌

Branded Items : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌: అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు ‘బ్రాండెడ్‌’ వస్తువులను అందజేయనున్నామని, ఇందుకోసం రూ.687.78 కోట్లు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం వివరాలు తెలిపింది. ‘‘ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యార్థులకు దీటుగా.. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన వస్త్రంతో యూనిఫాం..బ్రాండెడ్‌ బూట్లు, సాక్సు, టై, బెల్టులు అందజేయనున్నాం. గురుకుల విద్యార్థులకు ప్రత్యేకంగా బ్రాండెడ్‌ బెడ్డింగ్‌ సామగ్రిని ఇస్తాం. యూనిఫాంతో పాటు స్కూల్‌ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బెడ్డింగ్‌ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా ఇలా ప్రతి దానిలోనూ నాణ్యతకు పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పంపిణీలో ఏకరూపత కోసం ‘సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్మెంట్‌ సిస్టమ్‌’ తీసుకొచ్చాం. తొలిసారిగా అన్ని పాఠశాలల విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులను కూడా ఇస్తున్నాం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు కూడా ఏకకాలంలో యూనిఫాంలు, కిట్లు, ఇతర సామగ్రి ఇస్తాం.
యూనిఫాం రంగుల్లో మార్పు … మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంకు సంబంధించి 2.97 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలుకు ఉత్వర్వులిచ్చాం. విద్యార్థులకు లైట్‌ బ్లూ, డార్క్‌ బ్లూ, వైట్, ప్లెయిన్‌ మెరూన్, మెరూన్‌ చెక్స్‌ రంగుల్లో యూనిఫాం ఇస్తాం. విద్యార్థినులకు స్కర్ట్, పంజాబీ డ్రెస్, చున్నీ సరఫరా చేయనున్నాం. ఈ దఫా యూనిఫాం రంగులను మార్చాం. డే స్కాలర్స్‌కు టాప్‌ లైట్‌ బ్లూ, లోయర్స్‌ డార్క్‌ బ్లూ యూనిఫాంలుంటాయి. గురుకులాల్లోని విద్యార్థులకు టాప్‌లో మెరూన్‌ చెక్, లోయర్‌ మెరూన్‌ రంగులుంటాయి. యూనిఫాం కుట్టు పనిని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పజెప్పాం. రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాం కుట్టే సామర్థ్యం వీరికి ఉంది. ఒక్కో యూనిఫాం కుట్టినందుకు ప్రభుత్వం రూ.75 చెల్లిస్తుంది. ఈ పనితో సంఘాల్లోని మహిళలకు సుమారు రూ.40 కోట్లకుపైగా ఆదాయం సమకూరనుంది.
25-30% చేనేత కార్మిక సహకార సంఘాలకు.. యూనిఫాం, బెడ్డింగ్‌ ఆర్డర్లలో 25-30% రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘానికి అప్పగించాం. ఇందులో 25% యూనిఫాం వస్త్రం(సుమారు 56 లక్షల మీటర్లు), 100% దుప్పట్లు(6,49,381), 3 లక్షల బెడ్‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లు ఉన్నాయి. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల ఆర్డర్‌ను తెలంగాణ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌కి ఇచ్చాం’’ అని ప్రభుత్వం పేర్కొంది.

తొలిసారిగా కిట్లు సరఫరా… రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన సామగ్రితో కూడిన కిట్‌ను అందజేస్తున్నాం. ఇందులో యూనిఫాంతో పాటు.. తెల్లని బూట్లు, సాక్సులు ఉంటాయి. గతంలో బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు మాత్రమే బూట్లు ఇచ్చేవారు. ఈ దఫా అన్ని రకాల యాజమాన్యాల్లోని విద్యార్థులకు ఇస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, పట్టణ గురుకుల పాఠశాలల విద్యార్థులకు బెల్టు, ఐడీ కార్డు, టై, స్కూల్‌ బ్యాగు, బూట్లు(నలుపు, తెలుపు-సాక్సులతో), బెడ్డింగ్‌ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా, ట్రంక్‌ బాక్సు, పీటీ డ్రెస్, నైట్‌ డ్రెస్, ట్రాక్‌ సూట్‌తో కూడిన కిట్‌ను ఇవ్వనున్నాం. మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు తొలిసారిగా ట్రాక్‌ సూట్, నైట్‌ డ్రెస్‌లను అందజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు నల్ల బూట్లు, బెల్టును సరఫరా చేయనున్నాం. మొదటిసారిగా జూనియర్‌ కళాశాలల్లోని సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ బ్యాగు, బెల్టు, టై, నల్లబూట్లు, సాక్సులు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు సంబంధించిన పాఠ్య, నోటు పుస్తకాలు ఇప్పటికే ఆయా సంస్థలకు చేరాయి. త్వరలో వాటి పంపిణీ పూర్తి కానుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page