
జనసేన నేత సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి (బిగ్ ఎస్ ) వైయస్ఆర్సీపీలో చేరిక
YSRCP office inaugurated : త్రినేత్రం న్యూస్, అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యాలయాన్ని, వైయస్ఆర్సీపీ, సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్,సత్తి సూర్యనారాయణ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి పార్టీ కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేదని తెలిపారు. విశ్వాసం, ధైర్యం, నిబద్ధతతో ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల ముందు ఉంచడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
అనపర్తి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అక్రమాలు, మోసాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ వైయస్ఆర్సీపీ శ్రేణులు తమ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహేంద్రవాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు, సోషల్ మీడియాలో చురుకైన పాత్ర పోషించిన సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి (బిగ్ ఎస్ ) మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన పార్టీ మారినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తాను జనసేన పార్టీకి వీరాభిమానినైనా వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
అలాగే ప్రజలకు ఉపయోగపడే పనుల కంటే పీఆర్ స్టంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకువచ్చాయని తెలిపారు. అదే నమ్మకంతో తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు లేవని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలను అణగదొక్కే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు.
అలాగే జనసేన కార్యకర్తలు నిరాశకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని, అదే నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి వంటి నాయకులు పార్టీని వీడాల్సి వస్తోందని తెలిపారు. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే విజయంలో పవన్ కళ్యాణ్ ప్రభావం, జనసేన కార్యకర్తల కృషి కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

