జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా ఫిబ్రవరి 18, (త్రినేత్రం న్యూస్): విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)–మిలాన్ సంయుక్త సమీక్ష, విన్యాసాలు ఘనంగా జరగనున్నాయి. (సీనియర్ జర్నలిస్టు ఎం. ఆర్ .ఎన్. వర్మ ) స్నేహపూర్వక దేశాల మధ్య సహకారం, సముద్ర భద్రత, నౌకా శక్తి ప్రతిబింబించే ఈ మహోత్సవానికి విశాఖ సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
నేవీ ప్రతినిధులు, యుద్ధనౌకలు, సబ్‌మేరీన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఒకేచోట చేరి నిర్వహించే మహాసమీక్షే ఐఎఫ్ఆర్. స్వతంత్ర భారతదేశంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా నిలుస్తోంది. మన దేశంలో తొలి ఐఎఫ్ఆర్ 2001లో ముంబైలో, రెండవది 2016లో విశాఖలో నిర్వహించారు. 2026లో మూడవసారి కూడా విశాఖే వేదిక కావడం విశేషం.
ఈ నెల 15 నుంచి 26 వరకు భారత్‌లోనే అతి పెద్ద ఐఎఫ్ఆర్–మిలాన్ సంయుక్త సమీక్ష, విన్యాసాలు జరగనున్నాయి. 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధనౌకల సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం మీడియాతో ముందస్తు సమీక్ష నిర్వహించారు. నౌకల పెరేడ్‌లో 71 నౌకలు ఆరు వరసల్లో బారులు తీరనున్నాయి. ఇందులో 19 విదేశీ నౌకలు, 45 భారత నౌకాదళ నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు ఉన్నాయి. మొత్తం 65 దేశాల నుంచి నౌకాదళాలు పాల్గొంటున్నాయి.
2026లో మిలాన్‌తో పాటు అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్), భారత సముద్ర నౌకాదళ చర్చాగోష్టి కూడా నిర్వహించడం ఈ ఈవెంట్‌కు మరింత ప్రాధాన్యతను చేకూరుస్తోంది.
నావికా బలాన్ని చాటేలా మిలాన్ దేశ నావికా బలాన్ని ప్రపంచానికి చాటుతూ మిత్రదేశాలతో బంధాన్ని బలపరిచే వేదికగా మిలాన్ నిలుస్తోంది. ఈసారి మిలాన్–2026కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్‌లో సిటీ పెరేడ్ నిర్వహించనున్నారు.
మిలాన్‌కు 1995లో అండమాన్–నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో కేవలం నాలుగు దేశాలతో శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ‘లుక్ ఈస్ట్ పాలసీ’కి బీజం పడింది. ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు భారత ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. అనంతరం 2022లో విశాఖ తీరాన జరిగిన మిలాన్‌లో 39 దేశాలు, 2024లో అతిపెద్ద ఎడిషన్‌గా 51 దేశాలు పాల్గొన్నారు.
ఈ విన్యాసాల్లో భారత్‌కు ప్రతిష్టాత్మకమైన యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య పాల్గొనడం విశేషం.
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. భారత నావికాదళం నిర్వహణలో జరుగుతున్న ఈ మహోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి నావికులు హాజరవుతుండటంతో విశాఖ అంతర్జాతీయ సముద్ర రాజధానిగా మారనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

International Fleet Review

You cannot copy content of this page