పార్టీలు మరే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు.
నేను వైసీపీ లో ఉన్నా వైసీపీ లోనే కొనసాగుతా
కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాణి
త్రినేత్రం న్యూస్,జనవరి 30, మండపేట, కలలో కూడా తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాను వైసీపీ లోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీ లోనే కొనసాగుతానని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి స్పష్టం చేశారు. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది. సమావేశంలో తొలుత గత కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఓ ఘటనను కౌన్సిలర్ యరమాటి గంగరాజు గుర్తు చేశారు.
గత నెలలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను కౌన్సిల్ సమావేశానికి రానివ్వనందుకు సభ ఆఖరున సభ్యులు అంతా వాకౌట్ చేయగా వైస్ చైర్మన్, చైర్మన్ లు మాత్రం వాకౌట్ చేయలేదని, వారిద్దరూ ఆ పార్టీలోని ఉంటున్నారా లేక రాజీనామాలు చేస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చైర్మన్ రాణి స్పందిస్తూ కలలో కూడా అటువంటి ఆలోచన చేయవద్దని చెప్పారు. దీనిపై కౌన్సిలర్ రవి కుమార్ మాట్లాడుతూ గతంలో మీరు వాకౌట్ లు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ ఆప్పుడూ మీరిలాగే రాజీనామాలు చేసారా అంటూ తిరిగి ప్రశ్నించారు.
దీనికి గంగరాజు మౌనం వహించారు. అయినా గతం లో ఎప్పుడూ లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందని, ఎమ్మెల్సీ తోట ను కౌన్సిల్ కు రానీయకుండా చేయడానికి కారణం ఏమిటని రవి కుమార్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే వేగుళ్ళ స్పందిస్తూ గతం లో మండల సమావేశాల్లో చేస్తున్న తీర్మానాలను అడ్డుకుంటున్నందుకే అక్కడ నిబంధనలు మేరకు నడుచుకోవడం జరిగిందని, అక్కడి విధానాన్ని మున్సిపల్ కౌన్సిల్ లోనూ అమలు చేసినట్టు వివరించారు.
బూరుగుంట చెరువు వద్ద కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై ఎమ్మెల్యే వేగుళ్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి చైర్మన్ రాణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ముందుగా 50 లక్షల మున్సిపల్ నిధులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్పినప్పటికీ అవేమీ అవసరం లేకుండానే మొత్తం నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
వైస్ చైర్మన్ వేగుళ్ళ నారయ్య బాబు సూచనలు మేరకు మాజీ ఎమ్మెల్యే పాలచర్ల పనసరామన్న, వి.వి.ఎస్.ఎస్ చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ యినుమర్తి వీర సుభద్ర, బిక్కిన విజయ, వేగుళ్ళ జోగేశ్వరరావు, వల్లూరి విమల కుమారి, చుండ్రు శ్రీ వర ప్రకాష్ ల చిత్ర పటాలు కౌన్సిల్ సమావేశంలో ఉంచాలని కోరగా ఈ అంశం అజెండాలో చర్చకు వచ్చింది. దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ పాలచర్ల పనస రామన్న గొప్ప ఆదర్శ భావాలు కలిగిన నేత అని కొనియాడారు.
దళితులను ఆలయాలలోకి కూడా రానివ్వని దుర్భర పరిస్థితుల్లో ఆయనా, మరో ఐదుగురు సన్నిహితులు కలిసి ఎవరికి వారు దళిత మహిళలను వివాహం చేసుకోవాలని భావించుకున్నారన్నారు. అందరూ మాట నిలుపుకోలేకపోయినా అనుకున్న మాట ప్రకారం దళిత మహిళను వివాహం చేసుకున్న ఘనత పాలచర్లకే దక్కుతుందన్నారు.
ఒకసారి ఎమ్మెల్యే గా చేసి కూడా ఆ తరువాత తన తండ్రి వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ చైర్మన్ గా పని చేసిన సమయంలో వైస్ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేస్తూ అప్పట్లో ఆయన అంతగా విలువలకు కట్టుబడి ప్రజా సేవ చేసేవారని కొనియాడారు. అటువంటి మహనీయుని చిత్ర పటం తప్పనిసరిగా కౌన్సిల్ సమావేశంలో ఉండాలన్నారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, వల్లూరి రామకృష్ణ చౌదరి వంటి ప్రముఖుల చిత్ర పటాలని కౌన్సిల్ లో ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని కోరారు.
కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్ మాట్లాడుతూ గతం లో పన్నుల వసూళ్లు ఎలా జరిగేవని, ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. గతం లో డిమాండ్ నోటీస్ లు ఇచ్చి మోటార్ సైకిల్ పై మైక్ ప్రచారం చేసేవారని, కానీ ఇప్పుడు జీప్ వినియోగం తీసుకువచ్చి ఖర్చులు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఇదే విషయంపై కౌన్సిలర్ కాశీన కాశీ విశ్వనాధం స్పందిస్తూ గత ఏడాది, ఈ ఏడాది మైక్ ప్రచారానికి ఎంత ఖర్చు అయిందని ప్రశ్నించారు. దీనికి అధికారులు గత ఏడాది 40 వేలు, ఈ ఏడాది లక్షా ఐదు వేలు ఖర్చు అయినట్లు చెప్పారు.
జీపు అద్దె నెలకు 35 వేల రూపాయలని కమీషనర్ టీవీ రంగారావు తెలిపారు. సచివాలయ సిబ్బందిని, మోటార్ సైకిల్ ను ఉపయోగించి ఖర్చు తగ్గించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని రవి కుమార్ ప్రశ్నించారు. దీనికి కమీషనర్ సమాధానమిస్తూ కొందరు సరైన అవగాహన లేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, మోటార్ సైకిల్ పై ప్రచారం చేసేందుకు దివంగత నేత చుండ్రు శ్రీ వర ప్రకాష్ తో కలిసి తాము కొందరితో మాట్లాడగా రోజుకు 1800 రూపాయలు డిమాండ్ చేశారన్నారు. అంతకంటే తక్కువ మొత్తానికే జీప్ వస్తుండటంతో దానిని తీసుకోవడం జరిగిందన్నారు.
అలాగే ఏడాది కొత్తగా 43 లక్షలు మేర పన్నులు విధించడం జరిగిందన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బంది జీప్ లోనే వెళ్ళి పనులు నిర్వహించడం జరిగిందన్నారు. ఎల్.ఆర్.ఎస్, బి.ఆర్.ఎస్ లకు సైతం ఈ జీప్ లనే వినియోగించడం జరిగిందన్నారు. పన్నుల వసూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మండపేట మున్సిపాలిటీ టాప్ 20 లో ఉందన్నారు. పైగా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరుకు పన్ను వసూళ్లు లింకు పెట్టడం జరిగిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మరి కొన్ని అవసరాలకు సైతం తక్కువ ఖర్చుతోనే జీపు ను వినియోగించడం జరిగిందని వివరించారు.
గతం లో అందరికీ సక్రమంగా డిమాండ్ నోటీస్ లు వెళ్ళాయనీ, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదని రవి కుమార్ పదే పదే ప్రశ్నించారు. పట్టణంలోని ఏ వార్డులోనూ డిమాండ్ నోటీస్ లు ఇవ్వలేదని కౌన్సిలర్ లు అంతా చెప్పడంతో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కమీషనర్ వివరించారు. కాగా ఒక దశలో రవి కుమార్ పై స్వల్ప ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ కమీషనర్ మాట్లాడటంతో కమీషనర్ పై ఎమ్మెల్యే వేగుళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాలని ఈ ధోరణి మంచిది కాదని సున్నితంగా హెచ్చరించారు.
అలాగే హరిజనపేట, దళితవాడ, గిరిజన వాడ వంటి పేర్లను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కౌన్సిల్ లో చర్చకు వచ్చినప్పుడు మండపేట లో అటువంటివి ఎన్ని ఉన్నాయని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ ప్రశ్నించగా హరిజనపేట ఒకటి ఉందని కమీషనర్ సమాధానమిచ్చారు. దానికి ఆయన పాలచర్ల పనసరామన్న పేరు ను పెట్టాలని సూచించడంతో సభలో అంతా హర్షద్వానాలతో ఆమోదించారు. అలాగే శిలా ఫలకాలపై కౌన్సిలర్, వైస్ చైర్మన్ ల పేర్లు ఎందుకు వేయడం లేదని రెడ్డి రాధాకృష్ణ ప్రశ్నించారు.
జిల్లా కలెక్టరేట్ నుండి వచ్చిన ఆదేశాలు మేరకు నడుచుకుంటున్నాని కమీషనర్ వివరించారు. ఇంతకాలం ఉంచి ఈ కొద్ది రోజులు మాత్రం ఆపడం దేనికని, కావాలంటే కొత్త కౌన్సిల్ నుండి అమలు చేయాలని సూచించారు. దీనికి ఎమ్మెల్యే వేగుళ్ళ, చైర్మన్ రాణి లు మద్దతు పలికారు.సమావేశంలో చివరగా తమకు 14 నెలల నుండి గౌరవ వేతనం రావడం లేదని, వెంటనే అవి చెల్లించాలని కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్ కోరారు. అలాగే ఎప్పటి నుండో కౌన్సిలర్ లకు ఇస్తామంటున్న ట్యాబ్ లను సైతం అందించాలని విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


