Trinethram News : హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్‌పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్టు చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. మరో వైపు ఇప్పటికే 92 నకిలీ పాస్‌పోర్టులను గుర్తించిన సీఐడీ.. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేయడంలో నిమగ్నమైంది. వీరిలో పలువురు ఇప్పటికే విదేశాలకు వెళ్లగా.. మిగతావారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్‌పోర్టులు రద్దు చేయించేందుకు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. పాస్‌పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పాస్‌పోర్టు జారీ, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు.. అధికారులకు లంచాలు ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది.


