అరకులోయ డిసెంబర్ 20, (త్రినేత్రం న్యూస్): గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయితీ జాముగుడ బాలికల జీటిడబ్ల్యూఏ పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. తన ప్రమాణ స్వీకారం అనంతరం గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ఉద్దేశంతో వారానికి రెండుసార్లు పాఠశాలలను సందర్శిస్తున్నట్లు సాయిరాం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల హెచ్ఎం కళావతి, ఉపాధ్యాయ సిబ్బంది సాయిరాం ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన తరగతి గదులు, వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్లోని శుభ్రతను గమనించి వార్డెన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాలలో నెలకొన్న సమస్యలను వినతిపత్రం రూపంలో ఎస్టీ కమిషన్ సభ్యుడికి అందజేశారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాల కొరత ఉందని, వసతి గృహంలో మరుగుదొడ్లు సరిపోకపోవడం ప్రధాన సమస్యగా ఉందని తెలిపారు. అలాగే డార్మిటరీ, డైనింగ్ హాల్ సరిపోకపోవడం, వాచ్మెన్ లేకపోవడం, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ఏఎన్ఎం అవసరమని వివరించారు. విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయులకు టీచర్స్ క్వార్టర్స్ లేవని, విద్యార్థులకు క్రీడా మైదానం కల్పించాలని కోరారు. వసతి గృహం, విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ ఎత్తును పెంచాలని కూడా సూచించారు. సమస్యలను శ్రద్ధగా విన్న కిల్లో సాయిరాం, జాముగుడ జీటిడబ్ల్యూఏ పాఠశాలలోని అన్ని సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బురిడీ కొమ్ములు నాయుడు (అరకు ఎస్టీ సెల్ అధ్యక్షులు), తాంగుల విశ్వనాథం (సెంట్రల్ కాఫీ బోర్డు సభ్యుడు), తాంగుల రామదాసు (మాజీ ఎంపీటీసీ), డుంబ్రిగుడ, పెదలబుడు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పూజారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


