ఇచ్చిన మాట కోసం స్త్రీ శక్తి అమలు చేస్తున్నాం…
ఆటో డ్రైవర్లు పెద్ద మనస్సుతో ప్రభుత్వానికి సహకరించాలి…
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ, లీలా కృష్ణ లు…
త్రినేత్రం న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అన్నారు. మండపేట వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఆటో డ్రైవర్ ల సేవలో కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత సమావేశంలో మున్సిపల్ కమీషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. కూటమి ప్రభుత్వ గొప్పదనాన్ని కొనియాడటంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను నిశితంగా విమర్శించారు. దీంతో సభకు హాజరైన వారంతా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ రెండేళ్ల అనంతరం రిటైర్మెంట్ తర్వాత కూటమి కొలువులో ఏదో ఒక పదవి గ్యారంటీ అంటూ చమత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ సభను ఉద్దేశించి మాట్లాడుతూ స్ర్తీ శక్తి పథకం ఆటో డ్రైవర్ లకు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ వారు పెద్ద మనస్సుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందన్నారు. అయితే ఆటో డ్రైవర్ లు ఒక్కరూ బాధ పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేసి 15000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూటమి కి అప్పగించినా దానిని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఆనాడు దివంగత ఎన్టీఆర్ 35 రూపాయలతో దేశంలో మొట్టమొదటి సారిగా పింఛను పథకం ప్రవేశపెడితే నేడు దానిని 4 వేలకు తీసుకువెళ్ళి అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు. దివ్యాంగులకు 6 వేలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి 10 నుండి 15 వేలు ఇచ్చి దివ్యాంగుల హృదయాల్లో చంద్రబాబు నిలిచిపోయాడన్నారు. మండపేట నియోజకవర్గంలో ఏడాది కి 192 కోట్లు పింఛన్లు నిమిత్తం ఖర్చుపెట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా అమరావతిని తిరిగి పటాలకు ఎక్కించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు పై నమ్మకంతో దేశ విదేశాలనుండి ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెట్టింపు నిధులు మంజూరు చేసి మన రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని కొనియాడారు. కొన్ని మంచి పనులు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిని మంచి మనస్సుతో అర్థం చేసుకోవాలని ఆటో సోదరులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ మాట్లాడుతూ గత 15 నెలలుగా రాష్ట్రంలో నష్టపోయిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం తిరిగి గాడిన పెడుతుందన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుందన్నారు. గత ప్రభుత్వం కార్పొరేషన్ లు పెట్టి నిధులు పక్కదారి పట్టిస్తే ఇప్పుడు సక్రమ దారిలో అమలు అవుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అక్కడ అభివృద్ధి దూసుకుపోతుందన్నారు. ఆనాడు రోడ్లు దుర్భరంగా ఉంటే ప్రస్తుతం వాటిని పునర్నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రం లో జనసేన, టీడీపీ, బీజేపీ ఐక్యత తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని మంచి పథకాలను కూటమి అమలు చేస్తుందని లీలా ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ మాట్లాడుతూ ఆయుస్మాన్ భారత్ కార్డులను ప్రతీ ఒక్కరూ పొంది కేంద్రం అందిస్తున్న 5 లక్షల వరకు దేశమంతటా వైద్య సేవలు పొందాలని కోరారు. అలాగే తపాలా శాఖ ద్వారా కేవలం 750 రూపాయలు చెల్లించి 17 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను పొందవచ్చని చెప్పారు.
మండపేట ఎంపీపీ వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు 10 వేలు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 15 వేలు ఇస్తుందన్నారు. అలాగే దాదాపు 17 వేల రూపాయలు మేర గ్రీన్ టాక్స్ ను తగ్గించి రవాణా రంగ కార్మికులకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందన్నారు.
అనంతరం కోటి 48 లక్షల 65 వేల రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ళ ఆటో డ్రైవర్లకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ,నీటి పారుదల సంస్థ చైర్మన్ లీలాకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ లను ఆటో డ్రైవర్ లు దుస్సలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


