Trinethram News : సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించిన సీఎం – మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ, కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా బార్లకు అనుమతులు
అమరావతి మద్యం పాలసీతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా పరిగణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం వల్ల లక్షల కుటుంబాలు నష్టపోయాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, లోపాలు సరిదిద్దుతూ నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తేల్చి చెప్పారు. బార్ పాలసీలో కూడా గీత కులాలకు 10 శాతం బార్లు దక్కేలా చూడాలని సీఎం ఆదేశించారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా నూతన మద్యం పాలసీ ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, అధికారులతో కలిసి ఆబ్కారీ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న బార్ పాలసీ గడువు తీరడంతో సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ రావాల్సి ఉన్నందున అధికారులు సీఎంకు ప్రతిపాదనలు వివరించారు.
లాటరీ పద్దతిలో బార్లకు అనుమతులు: అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా కొత్త పాలసీకి రూపకల్పన చేసినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50,000 లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, ఆపై 5 లక్షల పైన జనాభా ఉన్నట్లయితే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజును ఏడాదికి పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉప సంఘం నుంచి వచ్చింది.
కొత్త పాలసీలో దరఖాస్తు రుసుం, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతీ బార్‌కు కనీసం 4 దరఖాస్తులైనా రావాలనే నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. పొరుగు రాష్ట్రాల పరిధిలో సరిహద్దుల్లో లిక్కర్ సేల్స్ పెరగడానికి గల కారణాలు అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో రేట్లు తగ్గడం, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండడం, నాణ్యమైన మద్యం దొరకడంతో మన రాష్ట్రానికి చెందిన మద్యం వినియోగదారులు ఇక్కడే మద్యం కొనుగోలు చేస్తున్నారని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న సీఎం: మన దగ్గర సరిహద్దు ప్రాంతాల్లో లిక్కర్ దుకాణాల్లో అమ్మకాలు పెరగుదలతో పొరుగు రాష్ట్రాల్లో విక్రయాలు తగ్గాయని అధికారులు తెలిపారు. గతంలో ఏపీలో నాణ్యమైన మద్యం లేకపోవడం, అధిక ధరలు, మంచి బ్రాండ్లు దొరక్క పోవడం వల్ల పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగేవాళ్లని గుర్తు చేశారు. దీన్ని సొమ్ము చేసుకోవడానికి అక్రమర్కులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చే వాళ్లని అధికారులు గర్తుచేశారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 12 జిల్లాలను పూర్తి స్థాయిలో ఐడీ లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటించామని అధికారులు వివరించారు.
ఈ నెలలోనే మరో 8 జిల్లాలను ఇల్లిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్ (ఐడీ లిక్కర్) ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని సీఎం తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ ఉండనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇచ్చి ఆల్కహాల్ మోతాదు తక్కువున్న మద్యాన్ని అందించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


