సూపర్ సిక్స్ కాదిది.. సూపర్ వంచన !
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట: తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం చూపించిన లెక్కలన్నీ తప్పుడు లెక్కలేనని వైసిపి ఆర్టిఐ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు, 8 వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అనేక లోటుపాట్లతోనూ అసత్య లెక్కలతోనూ అమలవుతోందన్నారు. ఈ పథకాన్ని సూపర్ సిక్స్ లో ఒకటిగా పేర్కొనడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం వాస్తవంగా ఇవ్వవలసిన లబ్ధిదారుల సంఖ్య 87,41,885 కాగా, వాటికి అయ్యే ఖర్చు సుమారుగా 13,112.82 కోట్లు అవుతుందన్నారు. కానీ కేటాయించిన లబ్ధిదారుల సంఖ్య 67,27,164 మంది ఉండగా, వారికి కేవలం 8745 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో బీసీలు 29,82,000, ఎస్సీలు 11,76,000, ఎస్టీలు 4,26,000, మైనారిటీలు 68,500, ఈబీసీలు 8,44,000 మందితో కలిపి మొత్తం 54,94,500 చూపించారన్నారు.
ఇక్కడే అసలు మోసం బయట పడిందన్నారు. ప్రభుత్వం మీడియా ముందు చెప్పిన లెక్కలు ప్రకారం 67,27,164 లబ్ధిదారులుండగా, పథకంలో చూపిన లబ్ధిదారుల సంఖ్య 54,94,500 మాత్రమే. మిగతా 12,32,664 మంది ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సైకో అని అభివర్ణించారని, అయితే ఇప్పుడు అదే పథకానికి 2000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పేరిట కట్ చేయడం, పథకం నుంచి అర్హుల్ని తొలగించిన వారిని పెద్ద సైకోలుగా ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు. ప్రారంభంలో ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగా అర్హత నిర్ధారిస్తాం అని చెప్పి, ఇప్పుడు తీరా చూస్తే సచివాలయాల్లో అర్హుల జాబితాలు పెట్టి, కొత్త షరతులు పెట్టడం ఏమిటని నిలదీశారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకంలో మిగిలిన 33 లక్షల తల్లులకు న్యాయం జరిగే వరకు వైసీపీ తరఫున ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏడాదికాలంగా మహిళల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


