Trinethram News : దళపతి నంబాల కేశవరావును, సీనియర్ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు. మరో అగ్ర నాయకురాలు, ఏవోబీ కమిటీ సీనియర్ సభ్యురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్ అరుణ (54), మరో నక్సల్ అంజూ కూడా ఈ ఘటనలో చనిపోయారు. వీరిలో అరుణ ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు రాంచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య. ఉమ్మడి ఏపీలో 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టుల బృందంలో ఉదయ్ ఒకరు. 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ కగార్‌ను తీవ్రతరం చేసింది. ఒడిశా అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది. దీంతో అక్కడ ఉండటం తమకు క్షేమం కాదని ఉదయ్ టీమ్ భావించింది. ఆయనతోపాటు యాభైమంది మావోయిస్టులు నెల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించారు.
ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు అల్లూరి జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పుల నుంచి మూడుసార్లు ఉదయ్, అరుణ త్రుటితో తప్పించుకున్నారు. కాకురి పండన్న అలియాస్ జగన్ కోరాపుట్ డీసీఎం రమేశ్ ఈ ఘటనల్లో చనిపోయారు. మరోవైపు, కీలక నేతల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఈనెల 20న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. డ్రోన్‌లను ఉపయోగించి ఉదయ్ బృందం ఉన్న ప్రాంతాన్ని ఎట్టకేలకు కనిపెట్టాయి. పక్కా వ్యూహంతో మంగళవారం రంగంలోకి దిగాయి. దేవీపట్నం మండల పరిధిలోని ఆకూరు, కొయ్యలగూడెం గ్రామాల సరిహద్దుల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ బలగాలకు బుధవారం ఉదయం మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉదయ్ సహా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే 47లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


